పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు: గడికోట

27 Oct, 2017 14:37 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ :  ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తామంతా నిర్ణయించుకున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో తీర్మానం చేశామని ఆయన అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణను విస్మరించి ఏరకంగా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారనే అంశంపై తమ పార్టీ ఎమ్మెల్యేలంతా అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిపై వైయస్‌ జగన్‌ లేఖ రాసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌కు పంపించడం జరిగిందని చెప్పారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని బలవంతంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు పంపిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ నుంచి రఘువీరారెడ్డిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సమావేశాలు బహిష్కరిస్తే దానిపై మాట్లాడకుండా పద్దతి కాదని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే వారి ఆలోచనలు అడ్డుకునే సమయం ఆసన్నమైందన్నారు. వాస్తవాలు, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడేవారిని మాత్రమే ప్రోత్సహించాలన్నారు.  జననేత వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అనుమతులు రావొద్దని చంద్రబాబు కుట్రలు పన్నారని.. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టగానే కుట్రలకు తెరలేపుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

శాసనసభ బులిటెన్‌లో పార్టీ ఫిరాయించినవారు, మంత్రి పదవులు చేపట్టినవారు కూడా వైఎస్‌ఆర్‌ సీపీలో ఉన్నట్లు చూపించడం సమంజసం కాదన్నారు. అంటే మా పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా జరిగాయన్నారు. గతంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 270 రోజులకుపైగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే... చంద్రబాబు అధికారం చేపట్టి 4 ఏళ్లు గడుస్తున్నా కనీసం 75 రోజులు కూడా జరగలేదన్నారు. ఇవి కాక పార్టీ ఫిరాయించిన వారిని విచ్చలవిడిగా ప్రోత్సహించడం, విప్‌ ఇస్తే దాన్ని అంగీకరించకుండా స్పీకరే అడ్డుకోవడం, శాసనసభ మంత్రి క్లాజ్‌లను తొలగించడం, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రశ్నించిన మహిళా సభ్యురాలిని ఏ విధంగా సస్పెండ్‌ చేశారో.. అందరికీ తెలుసని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా