బీసీలకు రాజకీయ వాటా దక్కాల్సిందే!

6 Oct, 2018 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేశాం. అందులో బీసీల వాటా కొంతమేర దక్కించుకున్నాం. అది పూర్తిస్థాయిలో పొందాలంటే రాజ్యాధికారం అవసరం. ఆ దిశగా సరికొత్త ఉద్యమాన్ని చేపడుతున్నాం. అదే బీసీ రాజకీయ సమితి (బీఆర్‌ఎస్‌)కి పునాది.’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

జనాభా లో 56శాతం ఉన్న బీసీలకు కులానికి ఒకటి చొప్పున సీట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ డిమాండ్‌ సాధనకు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటే లక్ష్యమని, కానీ ఎన్నికలు సమీపించిన తరుణంలో పార్టీ ఏర్పాటు సాధ్యం కానందున వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ లో బీసీ రాజకీయ యుద్ధభేరి మోగిస్తామన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల ‘సాక్షి’తో మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రంలో మరింత నష్టం...
తెలంగాణ ఏర్పాటైతే బీసీల అభివృద్ధి వేగవంతమవుతుందని భావించామనీ, ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉం డగా... కొత్త రాష్ట్రంలో సగా నికి పడిపోయిందన్నారు. అప్పట్లో 24 మంది ఎమ్మెల్యేలుంటే ఇప్పుడు 19కి తగ్గిందన్నారు. ఎంపీలు ఐదుగురు ఉంటే 2కు పడిపోయిందన్నారు.

ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాబితాలో బీసీలకు 21 టికెట్లే ఇచ్చారన్నారు. 5శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు మూడోవంతు సీట్లు కేటాయించడమంటే బీసీలను చిన్నచూపు చూసినట్లే అన్నారు. బీసీల రాజ్యాధికార సాధనకు బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తున్నామనీ త్వరలో ఇది రాజకీయ పార్టీగా మారుతుందని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీల హక్కు...
బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేది తమ ప్రధాన డిమాండనీ, తద్వారా ప్రాతినిధ్యం పెరిగి బీసీలవాణి వినిపిస్తుందని జాజుల అన్నారు. ఉత్తర భారతదేశంలో బీసీల పార్టీల వల్ల అక్కడ ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. కానీ దక్షిణ భారత దేశంలో సంఘాలకే పరిమితమైందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీసీ రాజకీయ సమితిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీలు సీట్లివ్వని చోట బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు