కోదండరాంవి శవ రాజకీయాలు

5 Dec, 2017 03:04 IST|Sakshi

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: విద్యా బుద్ధులు నేర్పే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు మంచి చెప్పాల్సిందిపోయి వారిని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. గతంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపేవారని, కానీ కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు.

గతంలో ఎప్పుడూలేని విధంగా సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఏపీపీఎస్సీ ద్వారా 24,086 ఉద్యోగాలు భర్తీ చేస్తే, కేవలం మూడున్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం టీఎస్‌ఎస్పీ ద్వారా 29,201 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. మురళి అనే విద్యార్థి డిగ్రీ పూర్తిచేసి పీజీలో చేరాడని, ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదన్నారు. కనీసం టీఎస్‌ఎస్పీలో వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌కు కూడా దరఖాస్తు చేయలేదన్నారు.

ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాయలేదని భయపడి ఆత్మహత్య చేసుకుంటే నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్నాడని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం శవరాజకీయాలు చేస్తూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి ఓయూలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఓయూకి వచ్చి అనవసరంగా రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు