కంటెంట్‌ ఉన్నోడు!

19 Mar, 2019 09:44 IST|Sakshi

కటౌట్‌

సామాజిక న్యాయం, మూఢాచారాల నిర్మూలన, భాషా వికాసం వంటి సైద్ధాంతిక పునాదులపై పుట్టిన డీఎంకే పార్టీలో ఆధునికంగా కనిపించినవాడు స్టాలిన్‌. ద్రవిడ దిగ్గజం కరుణానిధి ముద్దుల కుమారుడు. ఆయనకే అసలు సిసలు వారసుడు. కానీ తండ్రి నుంచి వారసత్వం వస్తుందని ఎన్నడూ ధీమాగా లేరు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి నీడ తనపై పడకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన 51 ఏళ్ల తర్వాత, కరుణానిధి మరణానంతరం తన 66వ ఏట స్టాలిన్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. తండ్రి సహకారం లేకుండా ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు స్టాలిన్‌కు గట్టి సవాల్‌నే విసురుతున్నాయి.

1953, మార్చి 1న కరుణానిధి రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కి స్టాలిన్‌ జన్మించారు. సోవియట్‌ పాలకుడు స్టాలిన్‌ నివాళి సభలో కరుణ మాట్లాడుతుండగా తనకు కొడుకు పుట్టాడన్న విషయం తెలియడంతో స్టాలిన్‌ అని పేరు పెట్టారు.
14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1967 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు
1973లో స్టాలిన్‌కు 20 ఏళ్ల వయసులో డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు.
ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్‌ కావడంతో స్టాలిన్‌ పేరు అప్పట్లో అందరికీ తెలిసింది.
ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1984లో కార్యదర్శి పదవిని చేపట్టారు. దాదాపు 40 ఏళ్లపాటు అదే పదవిలో కొనసాగారు.
1996లో చెన్నై నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే స్టాలిన్‌లో పాలనా సామర్థ్యం వెల్లడైంది.
1989లో తొలిసారి తౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు.
2017లో కరుణానిధి అనారోగ్యం కారణంగా స్టాలిన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ నేతల ట్రేడ్‌ మార్క్‌ దుస్తులు ధోవతికి బదులుగా వెస్ట్రన్‌ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు.
‘మన కోసం మనం’ అన్న నినాదంతో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోనూ ర్యాలీలు నిర్వహించి ఓటర్లతో నేరుగా మాట్లాడి ప్రత్యక్ష సంబంధాల్ని ఏర్పాటు చేసుకున్నారు.
కరుణానిధి మరణానంతరం ఆయన అన్న అళగిరి పక్కలో బల్లెంలా మారతారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అళగిరి కూడా తనను విస్మరించి స్టాలిన్‌కు ఎలా పట్టం కడతారంటూ చెన్నై వీధుల్లో నిరసనకు దిగారు. కానీ ఆయన వెంట పట్టుమని పదిమంది కూడా నడవలేదు.
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ఎవరికి వారే చీలిపోయినప్పటికీ దానిని స్టాలిన్‌ ఎంతవరకు క్యాష్‌ చేసుకోగలరన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి.
కార్యకర్తలే ఆయనకున్న బలం.. క్యాడర్‌ ఆయనను ఆప్యాయంగా దళపతి అని పిలుస్తూ స్టాలిన్‌ ఈ ఎన్నికల్లో విజేతగా నిలుస్తారన్న నమ్మకంతో ఉన్నారు.
ఇప్పుడు స్టాలిన్‌కు పార్టీలో ఎదురులేదు. ఆయన మాటే శాసనం. ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే మాదిరిగా అంతర్గత పోరు లేదు. మరి ఎన్నికల్లో స్టాలిన్‌ తన సత్తా ఎంతవరకు చాటుతారో మరి.

మరిన్ని వార్తలు