వారసులొచ్చారు..

5 Jul, 2019 03:42 IST|Sakshi
నిఖిల్‌ కుమారస్వామి, ఉదయనిధి

కుమారస్వామి, స్టాలిన్‌ తనయులకు పార్టీ యువజన బాధ్యతల అప్పగింత

సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్‌ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా జేడీఎస్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్‌ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు  జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్‌ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్‌ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి  పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది.
 

మరిన్ని వార్తలు