స్టార్‌ లిస్ట్‌ రెడీ

26 Mar, 2019 11:04 IST|Sakshi

స్టార్‌ క్యాంపెయినర్స్‌ రెడీ!

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అన్ని రాజకీయపక్షాలు తమ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఓటర్లను ప్రభావితం చేయగల నేతలను ఎంపిక చేసి ఏయే రాష్ట్రాల్లో ఎవరు ప్రచారం చేస్తారన్న జాబితాలను విడివిడిగా ఈ పార్టీలు జాతీయ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు అందజేశాయి.
మోదీ, అమిత్‌–రాహుల్, ప్రియాంక

బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జవదేకర్, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్, సీనియర్‌ నేతలు గులామ్‌నబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సిద్ధూ, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, డెప్యూటీ సీఎం సచిన్‌ పైలట్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, సీనియర్‌ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మాజీ మంత్రి, మాజీ నటుడు రాజ్‌బబ్బర్, గుజరాత్‌ పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉన్నారు. బిహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను యూపీలో తమ పార్టీ తరఫున ప్రచారంచేసే స్టార్‌ ప్రచారకుల జాబితాలో కాంగ్రెస్‌ చేర్చింది.

సాధారణ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్లను నియమించుకునే స్వేచ్ఛ రాజకీయ పక్షాలకు ఎన్నికల సంఘం కల్పించింది. రాష్ట్రాల వారీగా ఈ ప్రచారకుల జాబితాలను ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన వారంలోగా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈఓ) రాజకీయ పక్షాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర రాజకీయ పార్టీలు ప్రతి రాష్ట్రంలో గరిష్టంగా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను నియమించుకోవచ్చు. నమోదైన గుర్తింపులేని పార్టీలు 20 మంది వరకూ ఇలాంటి క్యాంపెయినర్లను నామినేట్‌ చేసుకునే వీలు కల్పించారు. ఎన్నికల ప్రచారంలో తమ ప్రసంగాలు, వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకునే ప్రముఖులనే పార్టీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉందనే అంచనాతోనే ఇలాంటి హేమాహేమీల జాబితాలు రూపొందించి ఎన్నికల సంఘానికి సమర్పిస్తాయి.

‘స్టార్స్‌’ ఖర్చంతా పార్టీ ఖాతాలోకే!
స్టార్‌ క్యాంపెయినర్ల విమాన, హెలికాప్టర్‌ ప్రయాణ ఖర్చులను ఆయా పార్టీల ఎన్నిక ఖర్చుల ఖాతాలో చేరుస్తారు. అలాగే వారు పాల్గొనే సభలు, ర్యాలీల వేదికలపై ప్రదర్శించే ఫ్లెక్సీలు, బ్యానర్లలో అభ్యర్థుల పేర్లు రాస్తే ఆయా ఖర్చులను ఆ అభ్యర్థుల మధ్య విభజించి వారి ఖాతాల్లో చేరుస్తారు.

>
మరిన్ని వార్తలు