242 కేసులు.. నాలుగు పేజీల ప్రకటన!

23 Apr, 2019 02:37 IST|Sakshi

కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌ సమర్పించిన అఫిడవిట్‌ చూసి ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తనపై ఏకంగా 242 క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. వాటిలో 222 కేసులు శబరిమల ఆందోళనకు సంబంధించినవేనట. వందల సంఖ్యలో కేసులుండటం ఒక విశేషమైతే, ఆ కేసుల వివరాలను ప్రకటించడానికి వార్తా పత్రికలో నాలుగు పూర్తి పేజీలు కేటాయించాల్సి వచ్చిందట. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను మూడు సార్లు పత్రికల్లో ప్రకటించాలి. టీవీల్లో కూడా మూడుసార్లు ప్రసారం చేయాలి. సురేంద్రన్‌ కేసుల వివరాలను పార్టీ పత్రిక ‘జన్మభూమి’లో ప్రకటించారు. అన్ని కేసుల వివరాలు ప్రకటించడానికి నాలుగు పేజీలు కావలసి వచ్చింది.

ఇక టీవీ విషయానికి వస్తే మామూలుగా ఒక అభ్యర్థి కేసుల ప్రసారానికి ఎక్కువలో ఎక్కువ ఏడు సెకన్లు పడుతుంది. అయితే, మన హీరోగారి కేసులన్నీ చదవడానికి 60 సెకన్లు పట్టిందట. టీవీ ప్రకటన కూడా పార్టీకి చెందిన ‘జనం టీవీ’లోనే ఇచ్చారు. పార్టీ పత్రిక కాబట్టి సరిపోయింది కాని అదే వేరే వార్తా పత్రికలో ఆ ప్రకటన ఇవ్వాలంటే ఒకసారి ఇవ్వడానికే రూ.60 లక్షలకు పైగా చెల్లించాల్సి వచ్చేదని, ఇది ఎన్నికల సంఘం అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల ఖర్చుకంటే ఎక్కువని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక టీవీ ప్రకటన ఖర్చుకూడా కలిపితే సురేంద్రన్‌ పరిమితికి మించి ఖర్చు చేసినందుకు కచ్చితంగా అనర్హుడవుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సురేంద్రన్‌పై ఉన్న కేసులేవీ కోర్టులో నిలబడేవి కావని కేరళ బీజేపీ శాఖ ప్రతినిధి ఎంఎస్‌ కుమార్‌ అన్నారు. చాలా కేసులు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే నమోదయ్యాయని తెలిపారు. శబరిమల ఆందోళన సందర్భంగా గత ఏడాది డిసెంబర్‌లో సురేంద్రన్‌ 22 రోజులు జైల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు