బ్రాహ్మణులు టీడీపీకి ఎందుకు ఓటేయాలి?

9 Apr, 2019 10:20 IST|Sakshi
మాట్లాడుతున్న బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌

బాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ మండిపాటు 

సాక్షి, అనంతపురం కల్చరల్‌: బ్రాహ్మణుల విషయంలో టీడీపీ వ్యవహారశైలిని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బ్రాహ్మణులు తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలి? రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసినందుకా? సంస్కృతి, ఆచార వ్యవహారాలను కించపరచినందుకా?’ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆవి ర్భావం నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోందన్నారు. ము ఖ్యంగా బ్రాహ్మణులపై ద్వేషభావాన్ని ప్రదర్శిస్తూ వస్తోందన్నారు. 1984లో కరణీకం వ్యవస్థను, 1997లో వంశపారంపర్య అర్చక వ్యవస్థను రద్దు చేసి కసి తీర్చుకుందన్నారు.

అయినప్పటికీ అధికారం కట్టబెడితే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు పేరుతో మరోసారి మోసం చేసిందన్నారు. నిజాయితీపరుడైన ఐవైఆర్‌ కృష్ణారావును తొలగించి అవినీతికి మారుపేరైన ఆనందసూర్యను చైర్మన్‌గా చేయడంతో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను తొలగించడం, మఠాధిపతులకు, పీఠాధిపతులకు మహా ద్వార ప్రవేశాన్ని నిలిపివేసి వారి అవమానించడం దారుణమన్నారు. ఇన్ని దుర్మార్గాలు చేయడంతోపాటు రాజకీయంగా ఏ ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్‌ కూడా బ్రాహ్మణులకు కేటాయించని టీడీపీని గద్దె దించేందుకు ఇదే చక్కటి అవకాశమని, చంద్రబాబు ఓటమే ధ్యేయంగా పనిచేయాలని బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు.

మన సంస్కృతిపై వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సంపూర్ణ విశ్వాసముందని, పీఠాధిపతుల వద్ద ఆయన వినయ విధేయతలు అందరినీ ముగ్ధులను చేశాయని చెప్పారు. అంతేగాకుండా రాజకీయంగా కూడా బ్రాహ్మణులకు నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, అందువల్ల 13 జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఆలయాలకు, అర్చకత్వానికి, ఆచార వ్యవహారాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో కూడా దూపదీప నైవేధ్యాలకు, జీర్ణోద్ధరణకు గురైన దేవాలయాలకు, అర్చక వ్యవస్థకు పెద్దపీట వేయడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బ్రాహ్మణ సం ఘం పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, అనిల్, వంశీ, భాస్కర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు