మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ

15 Feb, 2020 02:52 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ సూచన

రెండు మూడేళ్లుగా మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ

భారీ లక్ష్యాలు నెరవేరాలంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి

అభివృద్ధికి నిధులివ్వకుంటే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సవాలే

నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్‌ ఫోరం కార్యక్రమానికి హాజరు

సాక్షి, ముంబై: ‘ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. గత రెండు మూడేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా గణాంకాలు అదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం శషభిషలు వదిలి రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రాలు ఎంత వేగంగా ఎదిగితే దేశం కూడా అంతే వేగంగా ఎదుగుతుందనే సత్యాన్ని గుర్తించాలి’అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్‌ ఫోరం–2020 కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మార్చి టు 5 ట్రిలియన్‌ ఎకానమీ రియాల్టీ ఆర్‌ ఆంబియష్‌’అనే అంశంపై మహీంద్రా ఎండీ సీపీ గార్నానీ నిర్వహిచిన చర్చలో పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు. దేశాభివృద్ధి పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నానని, కానీ కేంద్రం ఇంతటి భారీ లక్ష్యం అందుకోవాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక నిబంధనలు, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఉన్నప్పుడే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమని స్పష్టంచేశారు. టీమిండియా, ఫెడరల్‌ వంటి పదాలను ఆచరణలో చూపాల్సిన సమయం ఇదేనన్నారు. వీటితోపాటు ఫిస్కల్‌ ఫెడరిలాజాన్ని కూడా అనుసరించాలని అభిప్రాయపడ్డారు.

మూలధన లభ్యతే ప్రధాన సమస్య
తెలంగాణ వంటి వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలకు మూలధన లభ్యత ప్రధాన సమస్యగా ఉందని కేటీఆర్‌ వెల్లడించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణ నచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలకు కఠినంగా ఉన్న కేంద్ర నిబంధనలు అడ్డంకిగా మారాయని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా నిధులు ఖర్చు చేయనప్పుడు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ సాకారం కావడం సవాలేనన్నారు. ‘దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులను సేకరించి ఖర్చు చేస్తే అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన అత్యంత సంప్రదాయ ఆర్థిక ఆలోచన. అభివృద్ధి చెందిన అన్ని ఆర్థిక వ్యవస్థలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినందునే అక్కడ అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని పేర్కొన్నారు.

అసెంబ్లింగ్‌ ఇన్‌ ఇండియాగా మారింది..
కేంద్ర ఆర్థిక నిబందనల సరళీకరణలతోపాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు. సేవారంగం, పర్యాటకం, వైద్యం, విద్య తదితర రంగాల్లో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకే బదిలీ చేయాలని అభిప్రాయపడ్డారు. సులభమైన నిబంధనలు ఉన్నప్పుడే తయారీ రంగంలో ఇతర దేశలతో మనదేశం పోటీ పడగలుగుతుందని.. బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, అపెరెల్‌ రంగంలో ముందున్నాయనే విషయం గుర్తించాలని సూచించారు. కేంద్ర నినాదమైన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కాస్తా ‘అసెంబ్లింగ్‌ ఇన్‌ ఇండియా’గా మారిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందాలంటే భారీ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోని పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదరాబాద్‌ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్ద వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. వీటికి ఉన్న జాతీయ ప్రాధాన్య దృష్ట్యా కేంద్రం సహకారం కోరినా ఇప్పటివరకు ఎలాంటి మద్దతూ ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులనే పట్టించుకోకుంటే భారీ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఆయన ప్రశ్నించారు.

నయా భారతానికి త్రీ ఐ మంత్ర..
గతంలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో దేశాభివృద్ధికి ‘త్రీ ఐ మంత్ర’పాటించాలని సూచించిన విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇన్నోవేషన్‌ (నూతన ఆవిష్కరణలు), ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (మౌలిక సదుపాయాలు), ఇంక్లూజివ్‌ గ్రోత్‌ (సమ్మిళిత వృద్ధి) ద్వారా నయా భారత్‌ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నూతన ఆవిష్కరణలు చేయాలని, ఈ రంగంలో తెలంగాణ.. టీహబ్‌ వంటి భారీ ఇంక్యుబేటర్‌ను నెలకోల్పిందని తెలిపారు. దేశం వేగంగా ఎదుగుతున్నా.. అనుకున్నంత మేర మౌలిక సదుపాయాలు విస్తరించడంలేదన్నారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో సుమారు రూ.50వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే దాదాపు రూ.1.60 లక్షల కోట్లను ఖర్చు చేశామని వివరించారు. అలాగే పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం పెరగకుండా.. అవి సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వి–హాబ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు విస్తరించాలని.. ఈ విషయంలో నాస్కాం ప్రత్యేక చొరవ చూపాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ నగరంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు మంచి స్పందన వస్తోందని.. మరిన్ని కంపెనీలు అక్కడకు రావాలని కోరారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు