అంతుచిక్కని వికాసం

18 Mar, 2019 08:01 IST|Sakshi

ఐదేళ్ల మోదీ పాలనపై స్టేటస్‌ రిపోర్ట్‌..

‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’.. భారతీయ జనతా పార్టీ 2014లో గద్దెనెక్కేందుకు మోదీ చరిష్మాకు ఈ నినాదం తోడైందనడంలో సందేహం లేదు. అందరి సాయంతో, అందరికీ అభివృద్ధి ఫలాలు అనే అర్థమున్న ఈ నినాదాన్ని బీజేపీ మనసా వాచా కర్మణ పూర్తి చేసిందా? ఈ ఐదేళ్ల పాలనను తరచి చూస్తే.. విశ్లేషిస్తే..

ఐదేళ్ల బీజేపీ పాలనను ఒకసారి పరిశీలిస్తే.. మోదీ నేతృత్వంలో ప్రగతిశీల సుస్థిర ప్రభుత్వాన్ని దేశానికి అందించిందనే చెప్పాలి. అదే సమయంలో దేశం మొత్తమ్మీద బీజేపీ రాజకీయ పెత్తనం చలాయించిన కాలమూ ఇదే. ఒకదశలో దేశం మొత్తమ్మీద 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగానో, పొత్తుల రూపేణా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఓటమి పాలైనప్పటికీ.. బాలాకోట్‌ దాడులు బలం చేకూర్చాయనడంలో సందేహం లేదు. మోదీని హీరో చేయడంతోపాటు దేశంలోని జాతీయవాద భావాలకు ఊపునందించడంలో ఈ దాడులు ఉపయోగపడ్డాయి. ఈ దాడులు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా లేవనెత్తిన పలు వివాదాలకు చెక్‌ పెట్టాయి.

‘పథకం’ ప్రకారం జన భాగస్వామ్యం
మోదీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అనేక ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద పది కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం.. అందులో భాగంగానే రైల్వేస్టేషన్లు, ఇతర పబ్లిక్‌ ప్లేసెస్‌ను శుభ్రం చేయడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఉజ్వల యోజన కింద ఆరు కోట్ల మంది మహిళలకు వంటగ్యాస్‌ సౌకర్యం కల్పించడం, ద ముస్లిం విమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌) చట్టం ద్వారా మధ్యయుగాల నాటి విడాకుల పద్ధతి ట్రిపుల్‌ తలాక్‌ను తోసిరాజనడం మోదీ చేపట్టిన ప్రజాదరణ కార్యక్రమాల్లో మచ్చుకు కొన్ని. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ద్వారా 50 కోట్ల మందికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా, ఆర్థిక స్తోమత ఆధారంగా అగ్రవర్ణాల వారికీ విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా, రూ. ఐదు లక్షల ఆదాయం వరకూ ఆదాయపు పన్ను మాఫీ వంటివీ మోదీ విజయాల ఖాతాలో వేయాల్సిందే. ఆయా పథకాలు ఎంత సమర్థంగా పనిచేశాయి? దీర్ఘకాలంలో వాటి ప్రభావం ఏమిటన్నది చర్చనీయాంశాలే అయినా.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చీకట్లో మగ్గుతున్న 18,000 గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు నింపడం మాత్రం కాషాయ దళానికి రాజకీయ ప్రయోజనం చేకూర్చేదే.

ఉపాధి హామీ పనులకు మళ్లిన రైతులు
వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మధ్య, ఉన్నత స్థాయి రైతులకే ఉపయోగపడ్డాయి. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చలేదు. దీంతో వీరిలో చాలామంది పడిపోతున్న ఆదాయాన్ని నిలబెట్టుకునేందుకు మళ్లీ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం పనులవైపు మళ్లారు. అయితే 2018–19 సంవత్సరానికి గాను ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోవడం, నిధులు పక్కదారి పట్టడం, కనీస వేతనాల చెల్లింపులు సరిగ్గా జరక్కపోవడం చిన్న, సన్నకారు రైతుల జీవితాలపై పెను ప్రభావం చూపాయి. అనుత్పాదక మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకాన్ని వాడటం, పథకాల అమలులో కేంద్రం పెత్తనం ఎక్కువగా ఉండటం.. కొన్ని రాష్ట్రాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థల్లో చోటు చేసుకున్న అక్రమాలు వంటివి ఎన్డీయే ప్రభుత్వం గమనించాల్సిన, సరిదిద్దాల్సిన అంశాలు.

నిరుద్యోగం...
గత ఐదేళ్లలో పారిశ్రామిక ప్రగతికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగలేదనడం నిష్టుర సత్యం. ఆర్థిక వృద్ధి ఒక శాతం పెరిగినప్పుడు ఉపాధి అవకాశాల్లో వచ్చే మార్పులు (డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యక్తులు చేసే పనులను మార్చుకోవడం) గత ఐదేళ్లలో కనిష్టంగా 0.17 శాతంగా నమోదైంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల తయారీ రంగానికి కాకుండా సేవల రంగానికి ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం పాక్షిక కారణం కావచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఎన్నిసార్లు చెబుతున్నా వాస్తవానికి జరుగుతున్నది మాత్రం ఉద్యోగాల్లేని ఆర్థికాభివృద్ధిగానే కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో అసంఘటిత రంగంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకూ తాత్కాలికంగా నష్టం జరిగింది.

పార్టీకి అతీతంగా మోదీ ప్రభావం..
ఐదేళ్ల మోదీ పాలన కాలంలో ఆదాయం.. సంపదల్లో అంతరాలు గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులోకి రాలేదని చెప్పవచ్చు. ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’ నినాదం రైతులు, ఉపాధి అవకాశాలు వెతుకుంటున్న యువతకూ వర్తించదని స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగంలోని సంక్షోభం.. పతాక స్థాయికి చేరిన నిరుద్యోగిత మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఎన్డీయేకు ప్రమాద ఘంటికలుగానే పరిగణించాలి. అయితే ‘మన్‌ కీ బాత్‌’ వంటి కార్యక్రమాలతో ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్న మోదీ ప్రభావం పార్టీకి అతీతంగా పనిచేస్తుందని, మరోసారి గెలుపును అందిస్తుందని అంచనా.

రైతన్నకు వ్యవ‘సాయ’మేదీ?
మోదీ హయాం మొత్తమ్మీద తరచూ వార్తల్లో నలిగిన అంశం.. వ్యవసాయ సంక్షోభం. పంటల మద్దతు ధరను ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లకు పెంచినా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా పంటల బీమా పరిధిని పెంచినా రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు. వ్యవసాయంలో యంత్రాల వాడకాన్ని పెంచడం, సాగునీటి వ్యవస్థల ఆధునీకరణ, పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచడం వంటి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. పలు రాష్ట్రాలు రైతు రుణాలను మాఫీ చేస్తున్నా రైతన్నల బతుకుల్లో వచ్చిన మార్పేమీ లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగానే పనిచేయనున్నాయి. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోవడం సూచించేదిదే. ఎన్డీయే హయాంలో వార్షిక వ్యవసాయ వృద్ధి రేటు 2.5 శాతం మాత్రమే ఉండగా.. యూపీఏ హయాంలో ఇది 3.6 శాతంగా ఉండటం గమనార్హం.

అన్నీ శుభపరిణామాలే అయినా..
వస్తు సేవల పన్ను విషయానికొస్తే.. తొలినాళ్లలో కొంత గందరగోళం ఉన్నా తరువాత పన్నుల శ్లాబ్‌లను హేతుబద్ధీకరించడం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద రూ.60 లక్షల వరకూ టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలకు కొన్ని మినహాయింపులివ్వడం చిన్నసైజు పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేవే. తప్పుడు అంచనాలతో సిద్ధమైన.. గందరగోళ పరిస్థితుల్లో అమల్లోకి వచ్చిన పెద్దనోట్ల రద్దు దుష్ప్రభావాలను తగ్గించేందుకు జీఎస్టీ కొంతవరకూ ఉపయోగపడింది కూడా. పెద్దనోట్ల రద్దు వల్ల నల్లధనం తొలగిపోయిందా? ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందా అనేది పక్కనపెడితే.. కోట్లమంది ఆన్‌లైన్‌ వ్యవహారాలు నడిపేందుకు, ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణకు ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. బోలెడన్ని కొత్త బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం, మరింత మంది బ్యాంకింగ్‌ వ్యవస్థలో భాగం కావడం ఆహ్వానించదగ్గ పరిణామాలే. రక్షణ రంగాన్ని ఆధునీకరించే, లోటుపాట్లను సరిదిద్దేందుకు మోదీ తన హయాంలో గట్టి ప్రయత్నమే చేశారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టం, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు వంటి కొన్ని ఎన్నికల హామీలను బీజేపీ నెరవేర్చలేదు. అయితే ఇందుకు బీజేపీ రాజకీయ సంకల్పలేమి కంటే.. ప్రతిపక్షాలు సృష్టించిన ప్రతిబంధకాలే ఎక్కువ కారణం. మరి, ఇవన్నీ శుభపరిణామాలే అనుకున్నప్పుడు మోదీకి ఉన్న ఆదరణ తగ్గేందుకు కారణాలేమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే.. ఆర్థికాంశాలను లోతుగా విశ్లేషించాలి -ప్రవీణ్‌ రాయ్,సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ

మరిన్ని వార్తలు