రాజకీయాలు.. కమల్‌, రజనీకి చిరు సలహా ఇదే!

27 Sep, 2019 10:12 IST|Sakshi

హైదరాబాద్‌: ‘మీరు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే.. రాజకీయాల్లోకి రాకండి’.. ఇది మెగాస్టార్‌ చిరంజీవి తన తోటి నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌కు ఇచ్చిన సందేశం. రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని ఆ ఇద్దరు నటులకు చిరంజీవి సూచించారు. తాజాగా ఆనంద వికటన్‌ అనే మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తన రాజకీయ ప్రస్థానంతోపాటు పలు విషయాలను పంచుకున్నారు. సినీరంగంలో ‘నంబర్‌ వన్‌’ హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో తాను గతంలో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

‘రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. కోట్లాది రూపాయలు ఉపయోగించి నా సొంతం నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. ఇటీవలి ఎన్నికల్లో నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఇదే అనుభవం ఎదురైంది’ అని చిరు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొనసాగాలంటే పరాజయాలను, అవమానాలను, అసంతృప్తలను దిగమింగుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దృఢ సంకల్పం గలవారని, వారు రాజకీయాల్లో కొనసాగాలని నిశ్చయించుకుంటే.. అన్ని సవాళ్లను, అసంతృప్తులను ఎదుర్కొని..ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మంచి ఫలితాలను రాబడుతుందని ఆశించినప్పటికీ.. అది జరగలేదన్నారు. 2008 ఆగస్టులో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో 294 సీట్లలో పోటీ చేసి.. 18 స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీలో చేరారు.
 

Poll
Loading...
మరిన్ని వార్తలు