నిజమైన అజ్ఞాతవాసి అతనే.. వెల్లడించిన పవన్‌!

21 Apr, 2018 10:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంబంధంలేని విషయాల్లో తనను లాగి.. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి.. నిజమైన అజ్ఞాతవాసి టీవీ9 చానెల్‌ సీఈవో రవిప్రకాశ్‌ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ9 యజమాని శ్రీనిరాజుపై పవన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై.. టీవీ9 చానెల్‌ ఈ వ్యవహారాన్ని నడిపిందని మండిపడ్డారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ మార్గదర్శకత్వంలో తన తల్లిని బూతులు పదేపదే తిట్టించారని, శ్రీసిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కై.. రవిప్రకాశ్‌ ఈ చర్యకు ఒడిగట్టాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు చేసిందంతా చేసి.. లీగల్‌ నోటీసులు పంపించడమేమిటని శ్రీనిరాజును పవన్‌ తప్పుబట్టారు. తన తల్లిని తిట్టించిన డ్రీమ్‌టీమ్‌లో లాయర్లు భాగం కాదంటూ.. శ్రీనిరాజు పంపిన లీగల్‌ నోటీసుల ప్రతిని పవన్‌ ట్వీట్‌ చేశారు.

ఉదయం నుంచి వరుస ట్వీట్లతో పవన్‌ కల్యాణ్‌ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల పచ్చ మీడియా తీరును తప్పుబడుతున్న ఆయన.. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ అంతకుమునుపు ట్వీట్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి’. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?’ అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. ‘స్టే ట్యూన్‌డ్‌.. లైవ్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ పేర్కొన్నారు. ఈ ‘అజ్ఞాతవాసి’ని ‘వాడో బ్లాక్‌మెయిలర్‌’ అని.. స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి  “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు... తెలుసుకోవాలనివుందా.. స్టే ట్యూన్‌డ్‌ టు “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం నుంచి - పవన్‌ కల్యాణ్‌ విత్‌ కెమెరామ్యాన్‌ ట్విటర్‌’ అని పోస్టు చేశారు.

టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ దుమారం.. అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వెల్లడించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక టీడీపీ అనుకూల మీడియా, లోకేశ్‌ కుట్ర ఉందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పవన్‌ అంతకుముందు ట్వీట్‌ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ హస్తం ఉందని ఆరోపించారు. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్‌ మరికొన్ని ఇతర చానళ్ల ద్వారా తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు అని మండిపడ్డారు. మహా న్యూస్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పెట్టుబడులు లేదా ఆయన బినామీలు ఉన్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు