మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి

19 Oct, 2019 03:12 IST|Sakshi
హరియాణాలో క్రికెట్‌ ఆడుతున్న రాహుల్‌

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి ఓనమాలు కూడా తెలియవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఆలోచనలను, ప్రణాళికలను దొంగిలించాలని అని హితవు పలికారు. ‘సాధారణంగా గ్రామీణ వినియోగం, పట్టణ వినియోగం కన్నా ఎక్కువ వేగంతో పెరుగుతుంటుంది. కానీ సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అది రివర్స్‌ అయింది. గత ఏడేళ్లలోనే కనిష్ట స్థాయిలో గ్రామీణ వినియోగం ఉంది’ అంటూ వచ్చిన ఒక మీడియా రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘గ్రామీణ భారతం సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఏం చేయాలో తెలీని స్థితిలో కేంద్రం ఉంది’ అని ట్వీట్‌ చేశారు.   

ప్రజల దృష్టి మరలుస్తుంటారు
మహేంద్రగఢ్‌:  దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని రాహుల్‌ విమర్శించారు.  నోట్ల రద్దు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌(గూడ్స్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌– జీఎస్టీ)ల కారణంగా వ్యాపార వర్గాలు భారీగా నష్టపోయాయన్నారు. కాగా, ఢిల్లీకి తిరిగి వచ్చే సమయంలో రాహుల్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ వాతావరణం సరిగా లేకపోవడంతో ఓ గ్రౌండ్‌లో అత్యవసర ల్యాండింగ్‌ అయింది.  గ్రౌండ్‌లో ఉన్న వారితో కలసి క్రికెట్‌ ఆడి అనంతరం రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు.  
 

మరిన్ని వార్తలు