నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్‌

8 Jan, 2019 02:34 IST|Sakshi

రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ ఖాన్‌ 

ఆమోదించిన గవర్నర్‌ నరసింహన్‌.. ఉత్తర్వులు జారీచేసిన సీఈవో 

ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన కేబినెట్‌

19న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్‌ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్‌)గా ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్‌ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్‌ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే తన విలువైన పదవీకాలం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మతసామరస్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ట్లుగానే.. అసెంబ్లీ వ్యవహరాల్లోనూ ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్‌ సభ్యుడిగా క్రిస్టియన్‌ మతానికి చెందిన ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ప్రతిపాదనలు పంపగా.. వీటికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కూడా దీనికి ఆమోదిస్తూ.. స్టీఫెన్‌సన్‌ నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్‌సన్‌ తెలంగాణ శాసనసభకు నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా నియమితులవడం ఇది రెండోసారి. తెలంగాణ తొలిశాసనసభలోనూ ఈయన నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర మంత్రి వర్గం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్‌ ప్రత్యేకంగా అభినందించింది.

ఎమ్మెల్యేలకు రాజ్యాంగం ప్రతులు
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగ ప్రతులను, అసెంబ్లీ నిబంధనల పుస్తకాలను, బుక్‌లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో వీటిని అందివ్వనుంది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ తొలి సమావేశం.. 19న ఉదయం 11.30 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర్సింహన్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 

మరిన్ని వార్తలు