పార్టీ నుంచి వలసలు ఆపండి

17 Feb, 2019 05:23 IST|Sakshi

అసంతృప్తులను బుజ్జగించి పార్టీ మారకుండా ఏదోలా చూడండి

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు సూచన

బయటకు వెళ్లినవారు స్వార్థపరులని ప్రచారం చేయండి

పార్టీ మారిన వారివల్ల ఎలాంటి నష్టం ఉండదని ఎదురుదాడి చేయండి

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపే అభ్యర్థుల తొలి జాబితా

జాబితాలో 100కు పైగా అభ్యర్థులు

సాక్షి, అమరావతి: పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య నాయకులకు సూచించారు. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి కీలక నాయకులు క్యూ కట్టిన నేపథ్యంలో వాటిని ఎలా ఆపాలనే దానిపై చంద్రబాబు వారితో చర్చించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై ఆయన నాయకులతో మాట్లాడారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్, దాసరి జైరమేష్‌ వంటి ముఖ్య నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులు అదేబాటలో ఉన్నట్లు సూచనలు అందడంతో ఏంచేయాలనే దానిపై నాయకులకు పలు సూచనలు చేశారు.

కొత్తగా ఎవరూ పార్టీకి రాజీనామా చేయకుండా అసంతృప్తులను బుజ్జగించాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికల తరుణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలో చేరితే పార్టీ క్యాడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, ప్రజల్లోనూ ప్రభుత్వం, పార్టీ బలహీనంగా ఉందనే సంకేతాలు వెళతాయని చెప్పి వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పలు సూచనలు చేశారు. బయటకు వెళ్లిన వారు స్వార్థ పరులని, టికెట్లు రావనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ఎదురుదాడి ప్రచారం చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడేలోపు అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేస్తానని చంద్రబాబు తెలిపారు. వందకు పైగా అభ్యర్థులు తొలి జాబితాలో ఉండేలా చూస్తున్నానని వివరించారు. 

మేనిఫెస్టో కమిటీ ఎంపిక నిర్ణయం బాబుదే
ఎన్నికల మేనిఫెస్టో కమిటీని నియమించే అధికారాన్ని చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్‌బ్యూరో సమావేశంలో నాయకులు తీర్మానించారు. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడల కోసం స్ట్రాటజీ (వ్యూహ) కమిటీ ఏర్పాటు బాధ్యత ఆయనపైనే పెట్టారు.  మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే అంశాలు ఉండేలా చూడాలని, రైతుల కోసం మరిన్ని హామీలు ఇస్తే బాగుంటుందని పలువురు నాయకులు తెలిపారు. తెలంగాణలో స్థానిక పరిస్థితుల్ని బట్టి వ్యూహాలు రూపొందించుకునే అధికారం ఆ రాష్ట్ర కమిటీకి అప్పగించారు. పొలిట్‌ బ్యూరో సమావేశ వివరాలను మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. సమావేశంలో మొదట పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

పొలిట్‌బ్యూరోకు అశోక్‌ గజపతి డుమ్మా   
 తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు నచ్చకే ఆయన సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల విజయనగరంలో జరిగిన భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు కూడా ఆయన హాజరుకాలేదు. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని, కనీసం తన జిల్లాకు సంబంధించిన విషయాలను కూడా చంద్రబాబు తనకు చెప్పడంలేదని ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో తనకు, తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

తన జిల్లాకు చెందిన కిశోర్‌చంద్రదేవ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, దానిపై ఒక్కమాట కూడా తనకు చెప్పకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా చంద్రబాబు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సమావేశానికి రాకపోవడంపై మీడియాలో వార్తలు రావడంతో టీడీపీ ముఖ్యులు ఆయనతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో విజయనగరంలో మీడియాతో మాట్లాడిన అశోక్‌గజపతి, చంద్రబాబుతో తనకు విభేదాలు లేవని, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్లే రాలేదని వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు