పోరాడితే పోయేదేముంది?

20 Nov, 2018 01:45 IST|Sakshi

అధిష్టానాలను కాదని బరిలో పలువురు నేతలు

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని అనుచరుల ఒత్తిడి

న్యాయం చేస్తామన్న పార్టీల హామీలపై సందేహం

వినోద్‌ బాటలో శంకర్రావు, వేణుమాధవ్‌ తదితరులు

ఇతర పార్టీల్లో చేరి టికెట్‌ దక్కించుకున్న ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌ :  టికెట్‌పై ఆశపడి భంగపడ్డారు. ఆనక భవిష్యత్తుపై బెంగతో బరిలోకి దిగుతున్నారు. గెలుపుపై గంపెడాశతో ముందుకు సాగుతున్నారు. టికెట్‌ దక్కుతుందన్న ఆశతో ఇంతకాలం పార్టీకి సేవ చేసినా మొండిచేయి చూపారన్న బాధ, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో పోటీ చేసినా ప్రయోజనముండదన్న ఆందోళన ఆయా నేతలను బరిలో దిగేందుకు ప్రేరేపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడినవారితో అధినాయకత్వాలు చర్చలు జరుపుతున్నాయి. అధినేతలు ఎంత నచ్చజెప్పినా పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఎలాగైనా పోటీ చేయాలని నిర్ణయించుకుని చిన్న పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు, జాతీయ పార్టీలను ఆశ్రయించి టికెట్లు దక్కించుకున్నారు. గెలిస్తే అధికార పార్టీ రెడ్‌కార్పెట్‌ పరుస్తుందని, ఓడిపోతే కొంతకాలానికి పాత పార్టీ నిషేధం ఎత్తేస్తుందనే ధీమాతో ఉన్నారు.  


అనుచరుల ఒత్తిడి 
టికెట్‌ ఆశించి భంగపడ్డవారు అన్నిపార్టీల్లోనూ ఉన్నారు. వీరితోపాటు వీరి అనుచరుల భవిష్యత్తూ ఇప్పుడు గందరగోళంలో పడింది. సత్తా చాటాలన్నా పార్టీకి తమ విలువ తెలిసి రావాలన్నా పోటీలో ఉండాల్సిందేనని నాయకులపై కార్యకర్తలు, అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. పోటీ చేయకుంటే పార్టీలో, ప్రజల్లో ఉనికిని, ప్రాబల్యాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఆయా పార్టీల అధినేతలు నచ్చచెప్పినా వీరు పట్టించుకోవడం లేదు.  

వినోద్‌బాటలో పలువురు నేతలు
సొంతపార్టీలో పంతం నెగ్గించుకోలేని నాయకులంతా ఆఖరి క్షణాల్లో ఇతర పార్టీలను, చిన్నపార్టీలు, చివరికి ప్రత్యర్థి పార్టీలను సైతం ఆశ్రయించేందుకు వెనుకాడటం లేదు. మొన్నటిదాకా టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీమంత్రి గడ్డం వినోద్‌కుమార్‌ చెన్నూరు టికెట్‌ ఆశించారు. కానీ, ఆ టికెట్‌ను ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినా వినోద్‌ సంతృప్తి చెందలేదు.

కాంగ్రెస్‌ నుంచి పోటీ చేద్దామని ఢిల్లీ వెళ్లి ఆఖరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన బీఎస్పీ తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. మాజీమంత్రి శంకర్రావు కూడా షాద్‌నగర్‌ బరిలో నిలిచేందుకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు. ముథోల్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌నేత రామారావు పటేల్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ సూర్యనారాయణ గుప్తా శివసేన తరఫున నామినేషన్‌ వేశారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ(చొప్పదండి) టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి టికెట్‌ సంపాదించారు. బొల్లం మల్లయ్య యాదవ్‌ (కోదాడ) టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి పోటీకి దిగుతున్నారు. నటుడు వేణుమాధవ్‌ చాలా ఏళ్లుగా టీడీపీ నుంచి కోదాడ టికెట్‌ ఆశిస్తున్నారు. 2014లో ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈసారి కూడా నెరవేరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నామినేషన్‌ వేశారు. 

మరిన్ని వార్తలు