పర్స్‌..పటాస్‌!

4 Nov, 2018 03:28 IST|Sakshi

పండుగలు..పబ్బాలు 

పూజల పేరుతో భారీగా ‘చదివింపు’లు   

పేలుతున్న ‘మామూళ్ల’ టపాసులు  

 ఒక్కొక్కరి ఖర్చు కోటిన్నర పైనే..

పండుగ వచ్చిందంటే ఇల్లంతా సంతోషం... కొత్త బట్టలు, అలంకరణలు, చుట్టాలు, పిండివంటలతో సందడే సందడి. తెలుగు ప్రజలు పండుగలకిచ్చే ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. కానీ, ఇప్పుడు కొందరికి ఈ పండుగలు ఎందుకొచ్చాయిరా బాబూ అనిపిస్తోందట. ఎన్నికలకు ముందే ఈ పండుగలు రావాలా అని చిరాకు పుడుతోందట. ఒక్కోసారి ఎటయినా కనిపించకుండా పోదామా అని కూడా అనిపిస్తోందట. ఏంటీ పండుగలు? ఎవరికి చిరాకు పుట్టిస్తున్నాయి? అనుకుంటున్నారా.. అయితే చదవండి. 

సరదాగా గడిచిపోవాల్సిన ‘ఫన్‌’డుగలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఎందుకొచ్చిన దండగరా బాబూ అనిపిస్తున్నాయట. మొన్నీమధ్యే వినాయకచవితి వేళ.. ఔత్సాహికపోటీదారుల గుండెల్లో బాజాలు మోగిస్తే.. మొన్నటి దసరా వేళ కార్యకర్తలు, అనుచరుల అత్యుత్సాహానికి ‘జేబు’ సరదా తీరిపోయింది. తాజాగా రానున్న దీపావళికి ఇప్పటి నుంచే జేబుల్లో టపాసులు పేలుతున్నాయి. ఎన్నికల పండుగ ముందు వచ్చిన  ఈ మూడు పండుగల పేరుతో ఇప్పటికే కొన్ని పార్టీల తరఫున అభ్యర్థులుగా ఖరారైన వారు, కొన్ని పార్టీల ఆశావహులు, తాజా మాజీ ఎమ్మెల్యేలకు తడిసి మోపెడవుతోందట.

ముఖ్యంగా సెప్టెంబర్‌లో వచ్చిన వినాయకచవితి పండుగ కోసం విగ్రహాలు, మంటపాలు, అన్నదానాలు, కోలాటాలు, డీజేలు, కోలాట బృందాలకు చీరలు.. ఇలా బాగానే వదిలించుకున్నారట. ఇక, అక్టోబర్‌లో వచ్చిన దసరాకు ‘మామూళ్లు’ అయితే అరుసుకున్నయంట. యువజన సంఘాలు, బస్తీ, కాలనీ కమిటీలు దుర్గామాత విగ్రహాల పేరుతో రాజకీయుల గుమ్మం తొక్కడంతో ఎన్నికల ముందు ఔననలేక, కాదనలేక అందుబాటులో ఉన్నంతా సమర్పించేసుకున్నారట. మళ్లీ ఇప్పుడు నవంబర్‌లో దీపావళి. అసలే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నెల. ఎవరు అలిగినా కష్టమే కదా! అందుకే పటాసులకు అడిగిందే తడవు ఫటాఫట్‌ తీసిచ్చేస్తున్నారట. మొత్తమ్మీద సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌.. ఒక్కో నెలలో వచ్చిన ఒక్కో పండుగ నేతల జేబుకు చిల్లు పెట్టి నోట్ల కట్ల వరద పారించిందన్నమాట. ఇంకా నయం ఎన్నికలు జరిగే డిసెంబర్‌లో ఇంకో పండుగ వచ్చి ఉంటే తీట తీరిపోయేదని ఆశావహులు అనుకుంటున్నారట.

అబ్బా... ఇన్ని కోట్లా!
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న 23, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్న 70 వరకు పోను గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు 25 ఉన్నాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలు కలిపి ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.2 కోట్ల వరకు ఈ మూడు పండుగలకు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. అంటే అవే రూ.50 కోట్లు. ఇక, పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో ఈ ఖర్చు రెట్టింపే.. కనీసం ఒక్కో అభ్యర్థి లేదా ఆశావహుడు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సమర్పించుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఒక్కోచోట రూ.4 కోట్ల వరకు ఖర్చయినా.. రూ.280 కోట్లు లెక్క తేలుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే నియోజకవర్గంలో ఉండే వందలాది బస్తీల్లోని గల్లీగల్లీల్లో పెట్టే విగ్రహాలు, మంటపాలు, అన్నదానాలకు కనీసం నియోజకవర్గానికి రూ.6 కోట్లయినా పెట్టి ఉంటారని అంచనా. ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే రూ.140 కోట్ల వరకు నేతల చేతి చమురు వదలిందన్న మాట. మొత్తం లెక్క చేస్తే రూ.470 కోట్ల వరకు మూడు పండుగలు మింగేశాయంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఇరవయ్యో..ముప్పయ్యో అటూ ఇటూ ఖర్చయి ఉంటాయిలే అనుకుంటే ఎన్నికల జాతర ముందొచ్చిన మూడు పండుగల వల్ల ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న ఆశావహుల కాసుల పెట్టెల్లో రూ.500 కోట్లు గల్లంతయినట్టే! అబ్బా.. అప్పుడే ఇంత ఖర్చా? అనుకోవద్దు. ఎందుకంటే.. ‘ఇన్‌ ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌!’ అంటున్నారు రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారు.
- మేకల కల్యాణ్‌ చక్రవర్తి

ఓడించే గోడ...
షాద్‌నగర్‌: గోడకు కొట్టిన బంతి వెనక్కి వచ్చేయడం ఎంత నిజమో ఈ గోడపై ఎవరిదైనా లీడర్‌ బొమ్మ పడినా.. ఆయన ఓడిపోవడం ఖాయం. ఇది స్థానికంగా బాగా నాటుకుపోయిన ఓ ‘నమ్మకం’. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా రథశాల ఉంది. ఎన్నికల సమయంలో ఈ రథశాలపై ఏ పార్టీ అభ్యర్థికి సంబంధించిన వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీ, జెండాలు ఏర్పాటు చేస్తే ఆ అభ్యర్థి ఓడిపోతాడనే ప్రచారం  ఉంది. ఈ రథశాల గోడపై గతంలో కొందరు అభ్యర్థుల పోస్టర్లు వెలిస్తే.. వారు ఓటమి చెందారట. ఇలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రులు, ప్రముఖ నాయకులు ఉన్నారట. అందుకే అప్పటి నుంచి ఈ రథశాల గోడపై ఏ ఒక్క పోస్టరూ పడదు.

మరిన్ని వార్తలు