ఎన్నికల ఖర్చు చట్టాలేం చెబుతున్నాయంటే...

25 Nov, 2018 05:22 IST|Sakshi

ఎన్నికల వ్యయంపై కఠిన నిబంధనలు

బిల్లులు, ఓచర్లతో సహా లెక్కచూపించాలి

విఫలమైతే మూడేళ్ల కాలానికి అనర్హత  

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌కు ఖర్చు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోగా అభ్యర్థి ఖర్చు వివరాలు పూర్తి లెక్కలతో సమర్పించాలి. లేకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10 ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తుంది.
- ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాల విషయంలోనూ అభ్యర్థి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిట్‌ ఉండాలి. పర్మిట్‌ పొందిన వాహనాల నిర్వహణ వ్యయం ఖర్చును రోజు వారీ లెక్కల్లో తప్పనిసరిగా వివరించాలి. ఇక పర్మిట్‌ లేని వాహనాలు ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం నిర్వహస్తున్నాడని పరిగణించి, భారత శిక్షాస్మృతిలోని అధ్యాయం 9ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. వెంటనే ప్రచారం నుంచి అభ్యర్థిని ఉపసంహరిస్తారు.
- ఇక లెక్క పక్కాగా ఉండాలి. చేసిన ప్రతి పైసకు సరైన ఆధారం చూపాలి. ప్రతి వ్యయానికి సంబంధించిన రశీదులు, ఓచర్లు తప్పకుండా సేకరించి పెట్టుకోవాలి. అభ్యర్థి చివరగా సమర్పించే ఖర్చుల వివరాలతోపాటు వీటిని జతపర్చాలి.  ఎన్నికల  నిబంధన 1961 ప్రకారం ఓచర్లు, బిల్లులు చూపకుంటే చర్యలకు అవకాశం ఉంది.

.:: మహమ్మద్‌ ఫసియొద్దీన్‌ 

అభ్యర్థులూ జర భద్రం. ప్రచారంలో మీరు పెట్టిన ఖర్చు లెక్కలు బరాబర్‌ చూపాల్సిందే ! లేకుంటే భవిష్యత్తులో కష్టాలే మరి. అలాగే మీ తరపున ప్రచారం నిర్వహించే స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చులు కూడా మీ ఖాతాలోకే వస్తాయి. ఇక ఫలితాల ప్రకటన అనంతరం 30 రోజుల్లోగా నిర్దిష్ట పద్ధతిలో సమర్పించకపోయినా లేదా అసలు ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వడంలో విఫలమయినా, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనుంది. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించడంలో విఫలమైన 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం ఈ అనర్హతను ఎదుర్కొంటున్నారు.  ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. మన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు పెట్టిన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు రాసుకుని ఉంచాలి. ఎన్నికల ప్రచారంలో వినియోగించే ప్రచార సామగ్రికి ముందే ఖర్చుపెట్టి ఉంటే దానిని కూడా ఎన్నికల వ్యయంలో చేర్చాలి. అభ్యర్థులు కార్యకర్తలకు పెట్టించే బిర్యానీలు, టీ, సమోసాల రేట్లు కూడా లెక్కగడతారు!  
 
ప్రతి వాహన వ్యయమూ పరిగణనలోకి .. 
ఎన్నికల ప్రచారానికి ఒక అభ్యర్థి ఎన్ని వాహనాలైన వాడవచ్చు. ఎన్ని వాహనాలు వాడాలనుకుంటున్నదీ, ఏయే ప్రాంతాల్లో ప్రచారానికి తిరగబోతున్నది ఆ వివరాలను పర్మిట్ల కోసం అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారికి లేదా అధీకృత ఉద్యోగికి సమర్పించాలి. పర్మిట్‌ పొందిన వాహనాల నిర్వహణ ఖర్చును రోజువారీ ఎన్నికల ఖర్చు నమోదు చేసే రిజిస్టరులో చేర్చాలి. ప్రచార కాలంలో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయించిన తేదీల్లో, నోటీసు అందుకున్న మూడు రోజుల్లోకూడా తనిఖీ నిమిత్తం ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టరును సమర్పించడంలో అభ్యర్థి విఫలమయితే –వాహన వినియోగానికి ఇచ్చిన పర్మి ట్‌ను రిటర్నింగ్‌ అధికారి ఉపసంహరించుకుంటారు.  ఇక పర్మిట్‌లేని వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం చేస్తున్న ట్లు పరిగణించి భారత శిక్షాస్మృతిలోని అధ్యాయం 9ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. 
- సోషల్‌ మీడియాలో ప్రకటనల ప్రచురణ కోసం ఇంటర్నెట్‌ కంపెనీలకు, వెబ్‌సైట్లకు చెల్లించే మొత్తాలను అభ్యర్థి ఖర్చులో చేర్చాలి. ఇదిగాక ఎన్నికల ప్రచారంకోసం వారి సొంత సోషల్‌ మీడియా అకౌంట్ల నిర్వహణకు ఏర్పాటు చేసుకున్న సిబ్బందికిచ్చే జీతాలు, నిర్వహణ వ్యయం, వాటిలో ప్రదర్శించే సమాచార నిర్వహణ వ్యయం కూడా చేర్చాలి.  

రూ.10 వేలకు కుదింపు 
అభ్యర్థులు ఎవరి నుంచి కూడా నగదు రూపంలో రూ.2 వేలకు మించి విరాళాలు తీసుకోవడానికి వీల్లేదు. అంతకు మించిన విరాళాలను చెక్కు రూపంలో స్వీకరించాల్సిందే. ఇప్పటి వరకు రోజుకు గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చులను నగదు రూపంలో చేసుకోవడానికి అనుమతి ఉండగా, తాజాగా రూ.10 వేలకు తగ్గిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రోజువారీ ఖర్చు రూ.10 వేలకు మించితే చెక్కులు/డీడీలను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

బరాబర్‌ లెక్కుండాలే!
- పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చు రాయడానికి రిటర్నింగ్‌ అధికారి ఒక రిజిస్టరును అందచేస్తారు. నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి ఫలితాలు ప్రకటించే తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) అయిన వాస్తవ ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు అందులో నమోదు చేయాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత 30 రోజులలోగా అభ్యర్థులందరూ వాస్తవ ఎన్నికల వ్యయ రిజస్టరును జిల్లా ఎన్నికలఅధికారికి సమర్పించాలి. 
ఎన్నికల వ్యయ నిర్వహణ కోసం ఒక ‘కరెంట్‌ అకౌంట్‌’ బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి. అభ్యర్థి పేరుతో విడిగా కానీ, ఎన్నికల ఏజెంట్‌తో కలిసి జాయింట్‌గా ప్రారంభించవచ్చు. నామినేషన్‌ దాఖలుచేసేటప్పుడే రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌.ఓ)కి ఈ బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయాలి. ఎన్నికల ఖర్చుకోసం కేటాయించిన మొత్తాన్ని అభ్యర్థి ఈ ఖాతాలో జమచేయాలి.
ఎవరికైన ప్రభుత్వానికి చెందిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని జడ్‌ ప్లస్‌ భద్రతలో భాగంగా అనధికార పనులకు వినియోగించినప్పుడు  దాని ఖర్చులు సదరు వ్యక్తే భరించాలి. స్టార్‌ కాంపైనర్‌ అభ్యర్థి అయితే ఆ నియోజక వర్గంలో ఆ వాహనం నిర్వహణ ఖర్చంతా అతని ఎన్నికల ఖర్చుకింద జమ అవుతుంది. ఒకవేళ స్టార్‌ క్యాంపెయినర్‌ కాకుండా పార్టీ నాయకుడై ఉండి భద్రత సౌకర్యం ఉన్నట్లయితే – అతను ఒక అభ్యర్థికి ప్రచారం చేసిన పక్షంలో ఆ భద్రతా వాహనం నిర్వహణ ఖర్చు లెక్క అక్కడి అభ్యర్థిదే.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యరులను ప్రతీ క్షణం నీడలా వెంటాడే...ఎన్నికల వ్యయం లెక్కలేసే అధికారులు ఉంటారు. చేసే ప్రతీ నయాపైస  ఖర్చును సైతం లెక్కగట్టి ఎన్నికల వ్యయంలో జమ కడతారు. ఇక అభ్యర్థి చూపే ఖర్చు..పరిశీలకులు గమనించిన లెక్కలకు తేడా వచ్చినా ఇబ్బందే. రాష్ట్రంలో అభ్యర్థులను గమనించేందుకు 53 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులున్నారు.

‘స్టార్‌’ల వ్యయమూ అభ్యర్థి ఖాతాలోనే
స్టార్‌ క్యాంపెయినర్ల బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు అభ్యర్థిగానీ, ఎన్నికల ఏజెంట్‌ గానీ వేదికను పంచుకుంటే దాని నిర్వహణ వ్యయమంతా అభ్యర్థి ఖాతాలో కలపనున్నారు. ఒకవేళ వేదికపై అభ్యర్థి లేకపోయినా సభలు నిర్వహించిన ప్రదేశంలో బ్యానర్లపై, పోస్టర్లపై అభ్యర్థి ఫొటో కనిపించినా, సభ, ర్యాలీలో స్టార్‌ క్యాంపెయినర్‌ తన ప్రసంగంలో అభ్యర్థి పేరు ప్రస్తావించినా, అప్పుడు కూడా మొత్తం ఆ ర్యాలీ, సభ వ్యయం అంతా అభ్యర్థి ఖాతాలోకే జమ అవుతుంది. వేదిక మీద కానీ, బ్యానర్లు , పోస్టర్ల మీద కానీ, ఒకరికి మించి ఎక్కువ అభ్యర్థుల పేర్లతో ఉంటే, అప్పుడు ఆ ర్యాలీ, సభ ఖర్చు ఆ అభ్యర్థుల మధ్య సమానంగా వారివారి ఖాతాల్లో జమ అవుతుంది.    

హామీల ‘బాండ్‌’ 
‘నన్ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా. లేకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. ఇందుకు హామీగా మీకు బాండ్‌ పేపర్‌ రాసిస్తున్నా’ అంటూ నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ప్రదీప్‌రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతున్న ఆయన శనివారం ఇందల్‌వాయి గ్రామస్తులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గ్రామాలకు వచ్చే ఇతర పార్టీల నాయకులను కూడా బాండ్‌ పేపర్‌ రాసివ్వాలని కోరాలంటూ హితవు చెబుతున్నారు. ఆయన ప్రచార శైలిపై గ్రామస్తులు ‘ఔరా’ అనుకున్నారు.  
– ఇందల్‌వాయి 

బరిలో ఇద్దరు ‘గండ్ర’లు  
జయశంకర్‌జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఒకే ఇంటిపేరు కలిగిన ఇద్దరు అభ్యర్థులు వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. వీరు గత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఒకరు రావు, మరొకరు రెడ్డి కావడం గమనార్హం. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మరో వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు 2014లో టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశించగా రాకపోవడంతో బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుతో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్‌ ఆశించడగా దక్కపోవడంతో ఈ ఎన్నికల్లో ఆలిఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరి ఇంటి పేర్లు గండ్ర కావడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.  
– భూపాలపల్లి అర్బన్‌ 

ఓటు ‘చక్కని’ పెండ్లి కార్డు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు సీహెచ్‌. శ్రీశైలంయాదవ్‌ కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆచారిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. వచ్చే నెల 12న శ్రీశైలం యాదవ్‌ కుమార్తె వివాహం తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలపై బీజేపీ అభ్యర్థి ఆచారిని గెలిపించాలని కోరుతూ.. ‘అందరికి ఇచ్చారు అవకాశం... ఆచారి అన్నకు ఇవ్వండి ఓ అవకాశం’ అంటూ కార్డుపై ముద్రించి బంధువులందరికీ పంచుతున్నారు. 
– ఆమనగల్లు(కల్వకుర్తి) 
 
ఓట్ల ‘బస్కీ’లు 
కరీంనగర్‌ నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ఆరు రోజుల పాదయాత్రను శనివారం ప్రారంభించారు. కట్టరాంపూర్‌లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘స్వామీ నీవే గెలిపించాలి’ అంటూ ఇలా గుంజీలు తీశారు.  
      – కరీంనగర్‌  

మరిన్ని వార్తలు