వారిని నిర్బంధించడం సిగ్గుచేటు: వైఎస్‌ జగన్‌

20 Nov, 2017 17:24 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన వారిని నిర్బంధించడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో  భాగంగా సోమవారం కర్నూలు జిల్లా గోవిందిన్నెలో వైఎస్‌ జగన్‌ను విద్యార్థి జేఏసీ ప్రతినిధులు కలిశారు. ప్రత్యేకహోదా ఉద్యమకారులపై చంద్రబాబు అణచివేత ధోరణి గురించి జగన్‌కు వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా ఏపీ హక్కు అని రాసున్న ప్లకార్డులు పట్టుకుని వైఎస్‌ జగన్‌, విద్యార్థులతో కలిసి నడిచారు. ప్రత్యేకహోదా నినాదాలతో హోరెత్తించారు.

నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వైఎస్‌ జగన్‌ కలిశారు. కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న 1738 పీఈటీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హుస్సేనాపురంలో జరిగిన మహిళా సదస్సులో వైఎస్‌ జగన్ పాల్గొన్నారు. అన్నివర్గాలకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు.


ప్రజల పక్షాన నిలవండి..
తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. మీ టోపీపై ఉన్న మూడు సింహాలను గౌరవించండి. వాటి వెనుక ఉన్న గుంట నక్కల కోసం పనిచేయొద్దు. నన్ను కలిసేందుకు వచ్చేవారిని అనుమతించండి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదు. నిజాయితీగా పనిచేయండి, ప్రజల పక్షాన నిలవండి’ అని జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు