ఫేక్‌ న్యూస్‌ ప్రభావం అంతంతే!

13 May, 2019 04:33 IST|Sakshi

భారత్‌లో ఓటింగ్‌పై బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: సోషల్‌మీడియా ద్వారా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ ద్వారా అందుకునే నకిలీ వార్తలు భారత్‌లోని ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న విషయమై బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎస్సెక్స్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ నకిలీ వార్తలు ఓటర్ల అభిప్రాయాన్ని ఎంతమాత్రం మార్చలేవనీ, అప్పటివరకూ ఉన్న ప్రజల నమ్మకాలను మరింత దృఢం చేస్తాయని పరిశోధకులు తేల్చారు.

ఈ విషయమై భారత సంతతి పరిశోధకుడు సయాన్‌ బెనర్జీ మాట్లాడుతూ.. ‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నకిలీ వార్తలు, వదంతుల కారణంగా మతఘర్షణలు, జాతుల మధ్య గొడవలతో పాటు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మేం భారత్‌లోని యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 18 లోక్‌సభ నియోజకవర్గాల్లో అధ్యయనం చేపట్టాం.

ఇందులో భాగంగా 3,500 మందిని ఎంపిక చేసుకుని వారి రాజకీయ అభిరుచులను తెలుసుకున్నాం. అనంతరం వీరిలో కొందరికి సాధారణ వార్తలను, మరికొందరికి దేశభద్రత, మౌలికవసతులకు సంబంధించి నకిలీ వార్తలను పంపాం. అక్కడ రాజకీయ నేతలు, పార్టీల పేర్లను ప్రస్తావించలేదు. నకిలీ వార్తల కారణంగా ప్రజల రాజకీయ అభిప్రాయం మారకపోగా, వారిలో ప్రస్తుతమున్న భయాలు మరింత బలపడ్డాయి‘ అని తెలిపారు.

వదంతులు మొదలయ్యేది ఇక్కడే..
భారత్‌లో రాజకీయ వాతావరణాన్ని నిర్దేశించేవాటిలో భద్రత, మౌలికవసతులు, ఆర్థిక రక్షణ అన్నవి కీలక పాత్ర పోషిస్తాయని సయాన్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘భద్రతాపరమైన సమస్యలు అంటే కేవలం మీ కుటుంబం లేదా సామాజికవర్గానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. పౌర హక్కులతో పాటు న్యాయ, పోలీస్‌ సంస్థలు అందుబాటులో ఉండటం కూడా. పోలీస్‌శాఖతో పాటు న్యాయస్థానాల్లో దళితుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో న్యాయం పొందడం దళితులకు కష్టసాధ్యంగా మారింది. దళిత హక్కుల పరిరక్షణ కోసం తెచ్చిన చట్టాలు, రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇక్కడి నుంచే నకిలీ వార్తల పరంపర మొదలవుతోంది’ అని తెలిపారు.

‘నకిలీ’ సంస్కృతి ఇప్పటిది కాదు..
బీజేపీలాంటి రాజకీయ పార్టీలు తీవ్రమైన ప్రభావం చూపగల సందేశాలను వాట్సాప్‌ గ్రూపుల్లో పంపుతోందని సయాన్‌ బెనర్జీ చెప్పారు. ‘ఇలాంటి సందేశాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నా. నకిలీ వార్తలు అన్నవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించేందుకు ఈ నకిలీ వార్తలను వాడుకున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్‌లో నకిలీ వార్తలు, వదంతుల్ని పర్యవేక్షించడం సవాలుగా మారింది.

కొత్త ఓటర్లపై సోషల్‌ ప్రభావం
ప్రస్తుతం దేశంలో తొలిసారి ఓటేస్తున్న 15 కోట్ల మంది యువతలో మూడోవంతు ఓటర్లు సోషల్‌మీడియాలో రాజకీయ సందేశాల ప్రభావానికి లోనయ్యారని ఏడీజీ ఆన్‌లైన్‌ అనే సంస్థ తెలిపింది. ఈ విషయమై ఏడీజీ సంస్థ చైర్మన్‌ అనూజ్‌ మాట్లాడుతూ..‘తొలిసారి ఓటుహక్కు పొందిన 15 కోట్ల మందిలో 30% మంది యువత సోషల్‌మీడియాలోని సందేశాలతో ప్రభావితులయ్యారు.  కొత్త ఓటర్లలో సగం సోషల్‌మీడియా ద్వారా రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. దేశంలో 18–24 ఏళ్ల యువతలో 40% మంది రాజకీయాల గురించి తెలుసుకోవడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, వాట్సాప్‌లపై ఆధారపడుతున్నారు’ అని చెప్పారు. 25 లక్షల మందిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించామని వెల్లడించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సోషల్‌మీడియాలో ఎన్నికల ప్రచారం పెరిగిందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?