తప్పు చేశానని ఒప్పుకుంటేనే వివాదానికి పుల్‌స్టాప్‌

1 Jun, 2018 07:21 IST|Sakshi
రావులపాలెంలో సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం

ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి రెడ్డి సుబ్రహ్మణ్యం సూచన

బీసీ సంఘాల నేతలు అభిమానులతో సమావేశం

రావులపాలెం (కొత్తపేట): జెడ్పీ సమావేశంలో తలెత్తిన వివాదంలో ఇప్పటికే తాను తప్పు ఒప్పుకున్నానని, అదేవిధంగా  ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి  కూడా తప్పు చేశానని ప్రతికా ముఖంగా ప్రకటన చేస్తేనే ఈ వివాదానికి పుల్‌స్టాప్‌ పెడతానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం రావులపాలెం కాపు కల్యాణ మండపంలో ఆయన జిల్లాస్థాయిలో బీసీ సంఘాల నేతలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు మాట్లాడుతూ సమావేశంలో పరుషంగా మాట్లాడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరంరెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజకీయాల్లో అనుకోని సంఘటనలు ఒక్కోసారి జరుగుతుంటాయన్నారు. జెడ్పీ ఘటన కూడా అటువంటిదేనన్నారు.

ఎమ్మెల్యేతోపాటు తాను కూడా సహనం కోల్పోయి ప్రవర్తించిన మాట వాస్తవమేన్నారు.  జగ్గిరెడ్డి తన మాదిరిగా పత్రికా సమావేశం పెట్టి ముందుగా తాను పేపర్లు విసరడం తప్పేనని ఒప్పుకుంటేనే వివాదం ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో టీవీ ఏర్పాటు చేసి జెడ్పీ సమావేశాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కేవీ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు,  వాడపల్లి దేవస్థానం చైర్మన్‌ కరుటూరి నరసింహరావు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు