తెలంగాణ ప్రభుత్వంపై సుబ్రమణ్యస్వామి ఫైర్‌

19 Jul, 2018 17:19 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ఈ విషయం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పరిపూర్ణానంద స్వామిజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. గూండాలపై పెట్టే కేసులు స్వామీజీపై పెడతారా అని ప్రశ్నించారు. ఒక సాధువును గూండాల ట్రీట్ చేస్తారా అని తీవ్ర స్థాయిలో సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు.

పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడమంటే ఆయనను తీవ్రంగా అవమానించడమేనని, అలాగే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని లేఖలో తెలియజేశారు. నగర బహిష్కరణ వల్ల ఆయన వాక్‌స్వాతంత్ర్యం, ఉద్యమ స్వాతంత్ర్యం హక్కులకు భంగం కలిగిందని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. రాముడిపై కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో ర్యాలీ తలపెట్టడంతో కత్తి మహేశ్‌తో పాటు పరిపూర్ణానంద స్వామిని కూడా పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు