శివసేన కోరితే.. మద్దతు ఇస్తాం: బీజేపీ

31 Jan, 2020 15:30 IST|Sakshi

సాక్షి, ముంబై :  సంచలన రాజకీయాలకు ఇటీవల వేదికగా నిలిచిన మహారాష్ట్ర.. మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం కనిపిస్తోంది. శివసేనను దూరంగా చేసుకుని  ఏకంగా సీఎం పీఠాన్ని కోల్పోయిన బీజేపీ.. తిరిగి పాత స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆశ ఇంకా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరితే.. వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు సుధీర్‌ మునగంటివార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాందేడ్‌ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర రాజకీయాలపైస్పందిస్తూ.. శివసేన తమ మిత్రపక్షమేనని, ఇద్దరి సిద్దాంతాలూ ఒకటేనన్నారు.

శివసేన నుంచి ప్రస్తావన వచ్చినట్టయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు పలుకడమనేది 21వ శతాబ్దాంలోని ఒక వింతగా సుధీర్‌ మునగంటివార్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ పేర్కొన్నట్టుగానే బీజేపీని అధికారం నుంచి దూరం చేసేందుకే కాంగ్రెస్‌ శివసేనకు మద్దతు పలికిందని విమర్శించారు. అయితే దీనివల్ల శక్తివంతమైన ముంబైలోని మాతోశ్రీ ప్రాబల్యం కొంతమేర తగ్గిందని మరోవైపు ఢిల్లీ మాతోశ్రీ బలం పెరిగిందంటూ సుధీర్‌ మునగంటివార్‌ శివసేనకు చురకలంటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో శివసేన తమతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుందన్న ఆశ బీజేపీలో ఇంకా ఉందని తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసి పూర్తి మెజార్టీ సాధించిన శివసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం విషయంపై విబేధాల కారణంగా బీజేపీతో కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్‌ మునగంటివార్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు