నల్లబెల్లం.. ఆశలు పదిలం

21 Mar, 2019 12:34 IST|Sakshi
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వెదురుకుప్పం మండలం పాతగుంట వద్ద రైతులతో కలసి చెరుకు గానుగ ఆడిస్తున్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

జగనన్న హామీతో.. చెరకు రైతు బతుకుల్లో తీపి

ఆంక్షలు.. తొలగించి ఆకాంక్షలు నెరవేరుస్తామని ప్రకటన

మూతబడ్డ షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భరోసా

చంద్రబాబు పాలనలో నష్టాలతో నీరుగారిన చెరకు రైతు

నల్లబెల్లం తయారీకి భారీగా అడ్డంకులు

రాష్ట్రంలోనే చెరకును అత్యధికంగా సాగు చేసే జిల్లా చిత్తూరు. లక్షలాది మంది రైతులకు ఈ పంటే ప్రధాన జీవనాధారం. చెరకు సాగుతో పాటు స్వంతంగా నల్లబెల్లం తయారు చేయడం ఇక్కడి రైతుల ప్రత్యేకత. ఇక చంద్రబాబు హయాంలో కనీస ప్రోత్సాహం లేక షుగర్‌ ఫ్యాక్టరీలు పూర్తిగా మూతబడ్డాయి. ఫలితంగా నల్లబెల్లం తయారు చేయడం జిల్లా రైతులకు తప్పనిసరిగా మారింది. అయితే బెల్లం తయారీపై తెలుగుదేశం ప్రభుత్వం భారీగా ఆంక్షలు విధించడంతో రైతులు బతుకులు చేదెక్కాయి. ఈ సమయంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చెరుకు రైతు కష్టాలను స్వయంగా చూశారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం నల్లబెల్లంపై ఉన్న ఆంక్షలను తొలగించడంతో పాటు చంద్రబాబు మూసివేసిన షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఫలితంగా అటుగంటుతు న్న ఆశలు జీవం పోసుకున్నాయని జిల్లాలోని చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.       

చిత్తూరు అగ్రికల్చర్‌ : జిల్లాలో ప్రధాన వాణిజ్యపంట అయిన చెరుకు సాగుకు.. కనీస ప్రోత్సాహం కరువైంది. అన్ని వర్గాలను ముంచేసినట్లే.. జిలాల్లోని చెరుకు రైతులనూ తెలుగుదేశం ప్రభుత్వం దగా చేసింది. చివరికి చిత్తూరు, గాజులమండ్యం చక్కెర కర్మాగారాలను అర్ధాంతరంగా మూయించి వేసింది. అలాగే నల్లబెల్లంపై ఆంక్షలు విధించడంతో రైతులు చెరకు పంటను సాగు చేయలేని దుస్థితికి చేరారు.

పతనం ఇలా..
జిల్లావ్యాప్తంగా రైతులు ఏటా సగటున 27 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తారు. వర్షాలు బాగా కురిసి భూగర్భ జలాలు సంవృద్ధిగా ఉంటే ఆ ఏడు సాధారణ విస్తీర్ణంకన్నా అధికంగా దాదాపు 40 వేల హెక్టార్ల మేరకు చెరకు పంటను పండిస్తారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టాక చెరకు సాగు విస్తీర్ణం ఏటా తగ్గుముఖం పడుతోంది. రైతులకు కనీస ఆదరణ లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. పైగా సాగునీరు అధికంగా వృథా అవుతుందనే పేరుతో.. చెరకు పంటను సాగు పై కొన్ని ఆంక్షలు విధించారు. పైగా నల్లబెల్లం తయారీకి ఇబ్బందులు సృష్టించడం, చిత్తూరు, గాజుల మండ్యం షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేయడంలో చెరకు రైతులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఫలితంగా 2014 నుంచి ఏటా చెరకు పంట సాధారణ విస్తీర్ణంతో పాటు, సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2014లో  27,705 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 27,004 హెక్టార్లు, 2015లో 27,215 హెక్టార్లకు గాను 20,831 హెక్టార్లు, 2016లో 26,181 హెక్టార్లకు గాను 18,214 హెక్టార్లు, 2017లో 24,291 హెక్టార్లకు గాను 19,564 హెక్టార్లు, 2018లో 22,304 హెక్టార్లకు గాను 17,266 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు సాగులోకి తీసుకొచ్చారు. ఉత్పత్తిని బెల్లంగా తయారు చేసి అమ్ముకోవాలన్నా.. రైతులకు కష్టాలు తప్పడం లేదు. దాడుల భయంతో వ్యాపారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కిలో బెల్లం రూ. 21 నుంచి రూ. 23 వరకు మాత్రమే ధర పలుకుతోంది. అయితే కనీసం కిలోకు రూ. 35 వస్తేగానీ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు.

వైఎస్‌.జగన్‌ భరోసా..
సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి 2018 జనవరి 10వ తేదీ వెదురుకుప్పం మండలం పాతగుంట వద్ద బెల్లం గానుగ వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. చెరకు సాగుకు పెట్టుబడి, బెల్లంకు గిట్టుబాటు ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లబెల్లంపై ప్రభుత్వం విధించిన ఆంక్షల విషయాన్ని ఆయన దృష్టికి రైతులు  తీసుకొచ్చారు. స్పందించిన జననేత మరుసటి రోజు (2018 జనవరి 11వ తేది) వెదురుకుప్పం బహిరంగ సభలో.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించారు. అలాగే మూతపడిన చిత్తూరు, గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు నేపథ్యంలో రైతులు నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేసే వారికే తమ మద్దతు అంటూ బల్లగుద్ది చెబుతున్నారు.

ఏడొందలా..? పెంచునా..!
‘‘ ఏనా.. నిన్నా మొన్నటి వరకు ఓటుకు అయిదు వేలని చెప్పినారు కదనా. ఇప్పుడేందినా ఉన్నట్టుండి ఏడొందలంటా ఉండారు.
మావోళ్లకి మాట కూడా ఇచ్చేసినా నా.. ఈటైంమ్‌లో ఏడొందలంటే మీకు డిపాజిట్లు కూడా రాదునో. ’’
‘‘ నువ్వు భలే చెబతావ్‌రా.. సుబ్బా. ఇల్లు కాలి ఒకడు ఏడస్తా ఉంటే.. సుట్టకు నిప్పడిగినాడంట. నీలాంటోడు. పోయినసారి ఎలక్షన్‌లో ఏదో దేవుడు కరుణించాడు. చిన్న చిన్న అప్పులన్నీ కొట్టేసినా. ఈసారి ఎలక్షన్‌కు ముందే చిన్న ప్లాటొకటకి కొనేదానికి అడ్వాన్సు టోకెన్‌ వేసినా. ఇంకా 30 లక్షలు కట్టాలి. ఓటుకు అయిదువేలివ్వాలని రేటు కూడా ఫిక్స్‌ చేసినాం. మొత్తం తల్లకిందులైపోయిందిరా. అయినా నువ్వేం భయపడకు.. పార్టీ నుంచి వచ్చేది. ఆడ ఈడ తీసుకునేంతా పోగేసి సగం నొక్కేయడం ఆ పెద్ద మనిషికి బాగా తెలిసిన విద్యేరా. పంచేదైనా, నొక్కేసేదైనా మన వాటా మాత్రం ఇచ్చేయమని చెప్పేసినా.’’     – చిత్తూరు అర్బన్‌

ఇప్పుడు ఇప్పమనుయా మూటలు..!
‘ఏనా సేతన్నా.. ఈ నాలుగు దినాలు ఏడా కనిపించనలేదు. మనోడ్ని అడిగితే అమరావతి పోయినావని సెప్పినాడు. మనిషి కూడా బాగా డల్‌ అయినావే. ఏమైనాది ఏంది..?’
‘నాకేమైనాది నాయుడు ..! బాగానే ఉండా. ఈ మధ్య ‘అమ్మ’ ఇంటి దగ్గరే ఉండినా. ఏందో ఆమె బాధలు అర్థంకాలే.
ఏందినా.. చిత్తూరులో పరిస్థితి ఈమాదిరి అయిపోయినాది. ఏదో అనుకుంటే ఏదేదో జరిగిపోయినాది. అయినా ‘అమ్మ’కు పిచ్చేమైనా ఎక్కినాదా..? ఏంది
‘అమ్మ’కు పిచ్చా..? ఎవరికి ఎక్కించాలో వాళ్లకి ఎక్కిచింనాది నాయుడు పిచ్చి. నాయాల్ది ఆమె ఉన్నన్ని రోజులు ఆడిపోసుకున్నారు కదా మీవోళ్లు. బస్సు పెట్టుకోని మరీ అమరావతిపోయి అమ్మపై చెప్పినారు కదయా, సీటు ఇవ్వొద్దని. అది చేయలేదు, ఇది చేయలేదు, పార్టీని సంపేసినాది అని గ్రూపుల్ని పెట్టి పచా రం చేసినారు కదయా..! అందుకే ఎవుడికి  ఏడ చెక్‌ పెట్టాలో ఆడ పెట్టినాది అమ్మ.’
ఏందినా అట్టా అంటా ఉండావు. పార్టీ పరిస్థితి మా పెద్దాయన సెప్పమంటే, ఉండేది బాబుకు సెప్పినామే తప్ప.. వేరే ఏముందినా.?
అవునుయో.. అయిదేళ్ల కింద అమ్మ కాడ ఎవరెవరు ఎంతెంత ఏరకతిన్నారు..? దీంట్లో మీవోళ్ల వాటా ఎంత అంతా తెలుసుయా. ఏడా ఇప్పుడు ఇప్పించినారు కదాయా సీటు మీరు సెప్పినోడికని.. ఇప్పమను మూట సూస్తాము.        – చిత్తూరు అర్బన్‌

జగనన్న హామీతో రైతుల్లో ధీమా..
నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో చెరకు రైతుల్లో ధీమా నెలకొంది. ఇకపై చెరకు సాగు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆంక్షలు ఎత్తివేయడం వల్ల గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.– వెంకటమునిరెడ్డి, రైతు,గంగాధరనెల్లూరు మండలం

సాగు విస్తీర్ణం పెరుగుతుంది..
చెరకుకు గిట్టుబాటు ధర వస్తే పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రైతులతో పాటు కూలీలు, కార్మికుల బతుకులు కూడా బాగుపడతాయి. ఇదంతా జరగాలం టే జగన్‌మెహన్‌రెడ్డి సీఎం కావాల్సిందే. ఆయన హయాంలోనే మాకు మంచి రోజులు వస్తాయి.– దొండపాటి మునికృష్ణమ నాయుడు,పెనుమూరు మండలం

మరిన్ని వార్తలు