బరిలో లేకున్నా బిజీయే!

12 May, 2019 06:28 IST|Sakshi

తీరిక లేని సుమిత్రా మహాజన్‌

ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)లోని బీజేపీ  కార్యాలయం నిండా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఓ గది సందర్శకులతో హడావుడిగా ఉంది. వందల మంది పార్టీ వాళ్లు, ఇతరులు ఆ గదిలోకి వెళ్లి వస్తున్నారు. పక్కనున్న ఇతర నేతల గదులు ఎవరూ లేక బోసిపోయాయి. సందడిగా ఉన్న ఆ గదిలో ఉన్నది సుమిత్రా మçహాజన్‌. ఇండోర్‌ సిట్టింగ్‌ ఎంపీ. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. అయినా పార్టీ శ్రేణులు, జనం ఆమెతోనే ఉంటున్నారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయిన 76 ఏళ్ల సుమిత్రా మహాజన్‌.

లోక్‌సభకు స్పీకర్‌గా చేసిన రెండో మహిళ. మీరా కుమార్‌ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన మçహాజన్‌ సభను నడిపించడంలో ఒక అమ్మ లా వ్యవహరించారు. ఆమె హయాంలో లోక్‌సభ ఎన్నో కీలక బిల్లులు ఆమోదించింది. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని మçహాజన్‌ రాజకీయంగా రాణించడమే కాక నియోజకవర్గం ఆదరాభిమానాలు విశేషంగా చూరగొన్నారు. అందరూ ఆమెను ఆప్యాయంగా ‘తాయి’ అని పిలుస్తారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చిన వాళ్లందరికీ ఎన్నికలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూన్నారు. ఎన్నికల్లో ఎవరెవరు ఎలా పని చేయాలో చెబుతున్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేను ఖాళీగా కూర్చుంటాననుకోకండి.

రోజూ అనేక మందిని కలుస్తున్నాను. పార్టీ యూనిట్లలో రోజువారీ సమావేశాలు జరుపుతున్నాను. ఆఫీసులోనే నాకు గంటలు గంటలు గడిచిపోతున్నాయి అంటున్నారు మçహాజన్‌. తాను పనిలో బిజీగా ఉండటమే కాకుండా ఎవరైనా పనిలేకుండా కనిపిస్తే వాళ్లకి ఏదో ఒక పని అప్పచెబుతానని నవ్వుతూ చెప్పారు లోక్‌సభ స్పీకర్‌. ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాననే బాధకాని, నిస్పృహ కాని ఆమెలో ఏ కోశానా కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధిగా ఉన్నా, మామూలు మహిళగా ఉన్నా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానన్నారామె. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయినప్పుడే ఎన్నికల్లో పోటీ చేయకూడదని దాదాపుగా నిర్ణయించుకున్నానని మçహాజన్‌ చెప్పారు. ఈ సారి మçహాజన్‌ పోటీలో దిగకపోవడం పట్ల నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాయి ఇండోర్‌లో ఒక భాగం. ఆమె ఎన్నికల్లో నిలబడకపోవడం విచారకరం.  ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా మçహాజన్‌ మా మనిషే అని పలువురు వ్యాఖ్యానించారు. కొత్తవాళ్లకు చోటిస్తూ తాను పక్కకి తప్పుకోవడం మంచి నిర్ణయమని కొందరన్నారు. ఎన్నికల్లో నిలబడకపోయినా ఎన్నికల వేడినుంచి మాత్రం ఆమె తప్పించుకోలేకపోతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు