నిజాయితీ నిరూపించుకునేందుకే!

9 Oct, 2018 01:17 IST|Sakshi

అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు

అసెంబ్లీ రద్దుపై సభ అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు

దీనిపై గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉండవు

హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సుందరం

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రగతిశీల పథకాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతోపాటు అవినీతి ఆరోపణలు చేశాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ సి.ఆర్యమ సుందరం హైకోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ పనితీరుపై దాదాపు 200ల పిల్‌లు దాఖలు చేసిన నేపథ్యంలో.. నిజాయితీని నిరూపించుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. ముం దస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ సహా తది తర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాము నిజాయితీపరులని భావిస్తే ప్రజలు తమకు పట్టంకడతారని, లేని పక్షంలో భిన్నమైన తీర్పునిస్తారని సుందరం పేర్కొన్నారు. అసెంబ్లీని 9 నెలల ముందు రద్దు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం, గవర్నర్‌ ఆమోదముద్ర పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 174(2)(బీ) ప్రకారం అసెంబ్లీ రద్దు చేసినప్పుడు గవర్నర్‌ నిర్వర్తించే పాత్రకు.. ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతి పాలనకు సంబంధించి నివేదిక ఇచ్చేటప్పుడు గవర్నర్‌ నిర్వర్తించే పాత్రకు స్పష్టమైన తేడా ఉందన్నారు.

రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్‌ తన విచక్షణాధికారాల మేరకు స్వతంత్రంగా వ్యవహరించి రాష్ట్రపతికి నివేదిక పంపిస్తారని తెలి పారు. అధికరణ 174(2)(బీ) కింద సభ రద్దయినప్పుడు గవర్నర్‌కు విచక్షణాధికారం ఉపయోగించే అవకాశమే లేదని, కేవలం మంత్రి మండలి సిఫారసును ఆమోదించి తీరాల్సిందేనన్నారు. ఈ కేసులో కూడా గవర్నర్‌ ఇలాగే వ్యవహరించారని తెలిపారు.

సందేహ నివృత్తి కోరిన ధర్మాసనం
9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చాలని, దీని వల్ల 20 లక్షల మంది యువత ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కోల్పోతున్నారని సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌ రెడ్డి, అభిలాష్‌ రెడ్డిలు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

దీన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్‌ల ధర్మాసనం గతవారం విచారించింది. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు గవర్నర్‌.. సభ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరా? కాదా? చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. అటు, ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత డీకే అరుణ ఇటీవలే పిల్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను కలిపి ధర్మాసనం విచారించింది.

గవర్నర్‌ను అడ్డుకునేవారెవరు?
పిటిషనర్ల తరఫు న్యాయవాది నిరూప్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దు విషయంలో గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చన్నారు. సహ జ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ఆయన వ్యవహరించాలన్నారు. కేబినెట్‌ సిఫారసులను గవర్నర్‌ పట్టించుకోని సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దయినప్పుడు సభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అసెంబ్లీ రద్దు విషయంలో సభ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు.

సీఎం చెప్పుచేతల్లో ఈసీ!
అసెంబ్లీని రద్దుచేసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలో సీఎం చెప్పినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నడుచుకుంటోంద ని నిరూప్‌ రెడ్డి అన్నారు. సీఎం చేసిన ప్రకటనలే నిదర్శనమన్నారు. సభ రద్దు అనంతరం సీఎం మీడియా తో మాట్లాడుతూ అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నిక ల షెడ్యూల్‌ విడుదల అవుతుందని చెప్పారని, దీనిక నుగుణంగానే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుద ల చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. డిసెంబ ర్‌లో ఎన్నికలు ఉంటాయని సీఎం చెప్పినట్లుగానే.. డిసెంబర్‌ 7న ఎన్నికలను ఈసీ ప్రకటించిందన్నారు.

సీఎం జోస్యంతోనే సమస్య!
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయంతో 18 ఏళ్లు నిండిన 20 లక్షల మంది కొత్త ఓటర్లు తమ హక్కును కోల్పోతున్నారని నిరూప్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.  దీని పై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో పైకి కనిపించని ఎజెండా (హిడెన్‌) ఉందని పిటిషనర్లపై ఏమంటారని న్యాయవాది సుందరంను ప్రశ్నించిం ది. పత్రికల కథనాల ఆధారంగానే పిటిషనర్లు ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఎలాంటి హిడెన్‌ అజెండా లేదన్నారు.

ఓటర్ల జాబితా పూర్తిగా ఈసీ పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ జాబితాలో తప్పులున్నాయ నే కారణంతో సభను రద్దు చేయడం సరికాదని విమర్శించడం అర్థరహితమన్నారు. ‘పిటిషనర్ల ఆరోపణ లు, పత్రికల్లో వస్తున్న కథనాలను పరిశీలిస్తే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీల విషయంలో సీఎం చేస్తున్న ప్రకటనలతోనే సమస్యలు వస్తున్నట్లున్నాయి. షెడ్యూల్, ఎన్నికల తేదీ తదితర విషయాల్లో భవిష్యత్తుల్లో ఏం జరగబోతోందో సీఎం ముందే జోస్యం చెప్పేస్తుండటంతో.. ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


పెరిగిన సీట్ల సంఖ్య
2014లో ప్రస్తుత ప్రభుత్వానికి 63 సీట్లు వచ్చాయని, ఆ తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ సంఖ్యను 93కు పెంచుకుందని నిరూప్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్‌ సైతం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూశారన్నారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియని ఈసీ చెబుతున్నందున.. 20 లక్షల మందికి ఈసారి తొలిసారి ఓటువేసే అవకాశాన్ని ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇందుకోసం ఎన్నికలను ఓ నెలపాటు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఉండదన్నారు.

సుప్రీంతీర్పు ఆధారంగానే: ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దు అయినప్పుడు ఎన్నికల నిర్వహణపై పూర్థిస్తాయి స్పష్టత లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదన్న ఉద్దేశంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు