కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌ రావు

29 Jan, 2020 10:16 IST|Sakshi

వెలమ సామాజిక వర్గానికే మేయర్‌ పీఠం

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌ ఎన్నిక

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ మేయర్‌ పీఠం విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠ ముగిసింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి సునీల్‌రావుకు మేయర్‌ అధ్యక్ష పదవి దక్కింది. జనరల్‌ కేటగిరీలో రిజర్వు అయిన కరీంనగర్‌ మేయర్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు ప్రయత్నించినప్పటికీ...  సునీల్‌రావు, రాజేందర్‌రావు మధ్యనే చివరి వరకూ పోటీ నెలకొంది. అయితే అధిష్టానం సునీల్‌ రావు వైపే మొగ్గు చూపింది. (కరీంనగర్ పైనా గులాబీ జెండా)

కాగా కరీంనగర్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వంటి ముఖ్యమైన స్థానాలన్నీ బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారే ఉన్నారు. జిల్లాలో ఉన్నత వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్‌ గత ఎన్నికల్లో ఓటమి చెందగా ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ మేయర్‌గా వెలమ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 33 కార్పోరేషన్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు..)

సునీల్‌ రావుకే దక్కిన పీఠం
కార్పొరేషన్‌ ఎన్నికల్లో 33వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన యాదగిరి సునీల్‌రావు భారీ మెజా రిటీతో విజయం సాధించారు. ఆయన కరీంనగర్‌ కార్పొరేషన్‌ నుంచి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. మంత్రి గంగుల కమలాకర్‌కు సమకాలీకుడైన సునీల్‌రావుకు ప్రణాళికాసంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌తో సాన్నిహిత్యం ఉంది. 

ఇక అదే సమయంలో మంత్రి గంగుల చిన్ననాటి స్నేహితుడైన వంగపల్లి రాజేందర్‌ రావు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి 56వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆయన పోటీ చేస్తున్నప్పటి నుంచే మేయర్‌ స్థానం రాజేందర్‌కే అనే ప్రచారం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా మంత్రి గంగుల  రాజేందర్‌రావుకే ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నేతలు భావించారు. అయితే నిర్ణయాధికారం అధిష్టానం చేతుల్లోకి వెళ్లడంతో బుధవారం ఉదయం వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగింది. ఆఖరికి పార్టీ అధినాయకత్వం సునీల్‌ రావు పేరును ఖరారు చేసింది.

నేడు మేయర్‌ ఎన్నిక.. డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణి
కరీంనగర్‌ నగర పాలక మండలికి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం మునిసిపల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మేయర్, డిప్యూటీ మేయర్‌లను లాంఛనంగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు