‘ఎంపీ టికెట్‌ అడిగితే చితకబాదారు’

23 Mar, 2019 07:58 IST|Sakshi

పీసీసీ చీఫ్‌ రఘువీరాపై సుంకర కృష్ణమూర్తి ఫిర్యాదు

సాక్షి, సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్‌): తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినందుకు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తనపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడని ఆ పార్టీ నేత, అడ్వకేట్‌ సుంకర కృష్ణమూర్తి శుక్రవారం విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 1972 నుంచి తాను కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేస్తున్నానని, గతంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని అన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్‌ తరపున పోటీ చేయడానికి  దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో రఘువీరాను కలిసి విజయవాడ పార్లమెంట్‌ టికెట్‌ను తనకు గాని, సుంకర పద్మశ్రీకి గాని కేటాయించాలని కోరానన్నారు. అందుకు రఘువీరా, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజా, అధికార ప్రతినిధి కిరణ్, ఆఫీస్‌బాయ్‌ గౌస్, మరో పది మందితో తనపై దాడి చేయించి పిడిగుద్దులు గుద్ది మెడపట్టుకుని బయటకు తోసేశారన్నారు. తనను చంపడానికి ప్రయత్నించిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

>
మరిన్ని వార్తలు