కౌంటింగ్‌లో సూపర్‌వైజర్ల పాత్ర కీలకం

17 May, 2019 09:18 IST|Sakshi
ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై శిక్షణ ఇస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

 కలెక్టర్‌ వినయ్‌చంద్‌

సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్ల పాత్ర కీలకమైనదని, ఈ నెల 23వ తేదీ వారంతా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియపై సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు గురువారం స్థానిక ఏ–1 కన్వెన్షన్‌ హాలులో శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు చిత్తశుద్ధితో నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. కంట్రోల్‌ యూనిట్‌లో ఓట్ల లెక్కింపులో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు నోటాలో వచ్చిన ఓట్లు కూడా నమోదు చేయాలన్నారు.

రౌండ్ల వారీగా, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లు సక్రమంగా ప్రీప్రింటెడ్‌ ఫారం–17సీ పార్ట్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఫారం 17సీ పార్ట్‌ ఎంతో ముఖ్యమైనదన్నారు. అదేవిధంగా 17ఏ బ్యాలెట్‌ పేపర్‌ దగ్గర ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 17సీ పార్ట్‌ పూర్తి చేసి ఒక కాపీని నోడల్‌ అధికారికి, మరో కాపీని అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారికి అందజేయాలన్నారు. కంట్రోల్‌ యూనిట్‌లో పోలైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలని, తప్పులు జరిగితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ, వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామన్నారు. రౌండ్ల వారీగా, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల డేటాను మైక్రో అబ్జర్వర్లు నమోదు చేసి నేరుగా ఎన్నికల అబ్జర్వర్లకు అందజేయాలన్నారు. ప్రతి కౌంటింగ్‌ హాలుకు ఇద్దరు నోడల్‌ అధికారులను నియమించామన్నారు. తప్పనిసరిగా కంట్రోల్‌ యూనిట్‌లో గ్రీన్‌ పేపర్‌ సీల్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. 
కౌంటింగ్‌ ఏజెంట్లు సంతృప్తి పడేలా పనిచేయాలి...
కౌంటింగ్‌ ఏజెంట్లు సంతృప్తి పడేలా పనిచేయాలని సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో రెండు హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు అపాయింట్‌మెంట్‌ లెటర్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో రెండు కంట్రోల్‌ యూనిట్లను ఎన్నికల అబ్జర్వర్లు ర్యాండమ్‌గా పరిశీలిస్తారని వెల్లడించారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు ప్రతి రౌండ్‌లో డేటాను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఈవీఎంలతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు లెక్కిస్తామన్నారు.

కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు ఉదయం 5.30 గంటలకు తప్పనిసరిగా కౌంటింగ్‌ హాలులో కేటాయించిన టేబుల్‌ వద్ద ఉండాలన్నారు. కౌంటింగ్‌ హాలులోకి మొబైల్‌ ఫోన్లు అనుమతించరని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎదరుపడే అసాధారణ పరిస్థితులను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాలను అధికారులకు కలెక్టర్‌ వివరించారు. కౌంటింగ్‌ ప్రక్రియను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా పూర్తి స్థాయిలో వివరించారు. శిక్షణలో ప్రత్యేక కలెక్టర్‌ వీఆర్‌ చంద్రమౌళి, జాయింట్‌ కలెక్టర్లు నాగలక్ష్మి, సిరి, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, 12 నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు