ప్రత్యేక హోదా బంద్‌కు మద్ధతుగా..

23 Jul, 2018 12:37 IST|Sakshi

అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీల వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ రేపు(ఈ నెల 24) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. బంద్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లాలో పలు చోట్లు ధర్నాలు, రాస్తారోలు, ర్యాలీలు తీశాయి.

వైఎస్సార్ జిల్లా
కడప నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతల విన్నూత్న నిరసన చేపట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ వైఖరికి నిరసనగా అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా-  ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా
పార్వతీపురంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన బంద్ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరుతూ నియెజకవర్గ సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంటరీ అధ్యక్షులు పరీక్షీత్ రాజు హాజరయ్యారు.

విశాఖపట్నం జిల్లా
రాష్ట్ర బంద్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ ఉత్తర కన్వీనర్ కె.కె.రాజు ఆధ్వర్యంలో తాటిచెట్ల పాలెం నుంచి మద్దిలపాలెం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వైఖరిపై విసుగెత్తి ప్రజలు బంద్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కేకే రాజు తెలిపారు.

అనకాపల్లిలో ప్రత్యేక హోదా కోసం రేపు జరగబోయే బంద్ విజయవంతం కావాలంటూ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నేతలు దంతులూరి దిలీప్కుమార్, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరిబాబు,గొల్లవిల్లి శ్రీనివాసరావు, బీశెట్టి జగన్, బొడ్డేడ శివ, మురళీకృష్ణ రమణ అప్పారావు.

అనంతపురం జిల్లా
ఏపీ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  రాయదుర్గంలో రేపటి బంద్ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

చిత్తూరు జిల్లా
రేపటి బంద్‌కు మద్ధతుగా తిరుపతిలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో ఎస్‌వీయూ నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు 3000 మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు జిల్లా
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ చేసిన మోసానికి నిరసనగా రేపు జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ నేత, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

కృష్ణా జిల్లా
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలంటూ జగ్గయ్యపేలో వైఎస్సార్‌ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా