సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ

29 Jan, 2019 14:18 IST|Sakshi

హాజరు కాలేనని తెలిపిన ఉదయ్‌ సింహ తరఫు లాయర్‌

తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్‌ సింహ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన జస్టిస్‌ లావునాగేశ్వర్‌ రావు ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను నేడు కోర్టుకు హాజరు కాలేనని, తనకు రెండు వారాల పాటు సమయం కావాలని  ఉదయ్‌ సింహ తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా న్యాయమూర్తికి లేఖ రాశారు. సిద్దార్థ అభ్యర్థనను సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు ఉదయసింహ దాఖలుచేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్‌తో కేసు విచారణ ఆలస్యం చేయాలనే రకరకాల ఎత్తుగడులను ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది హరేన్‌ ధావల్ వాదించారు. మరో నిందితుడైన మత్తయ్య పేరును ఈ కేసు నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.  2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక కూడా ఇచ్చింది. అయితే రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు