ఎలక్టోరల్‌ బాండ్స్‌.. గోప్యతా? పారదర్శకతా?

16 Apr, 2019 04:34 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం గత యేడాది జనవరిలో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇందులో పారదర్శకత లోపించిందంటూ విమర్శలొస్తున్నాయి. దీన్ని నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందచేయాల్సిందిగా రాజకీయ పార్టీలను ఆదేశించింది.
అసలీ పథకం లక్ష్యమేమిటి? దీనిపై వ్యతిరేకతకు కారణాలేమిటి?

బాండ్‌ అంటే రుణ రూపంలోని పెట్టుబడి. ఎవరైనా బాండ్‌ను కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వానికో, మున్సిపాలిటీకో లేదా కార్పొరేషన్‌కో అప్పు ఇస్తున్నారన్న మాట. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం 2017 ఫైనాన్స్‌ చట్టం ద్వారా ఎలక్టోరల్‌ బాండ్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 జనవరి 2న దీన్ని నోటిఫై చేసింది. ఎన్నికల వ్యయ ప్రక్షాళన కోసమే దీన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ బాండు ప్రామిసరీ నోటు తరహాలో ఉంటుందని ప్రకటించింది. అధీకృత బ్యాంకు నుంచి వీటిని పొందాల్సి ఉంటుంది (ఎస్‌బీఐ బ్యాంకు శాఖల నుంచి మాత్రమే బాండ్లు కొనుగోలు చేయాలని కేంద్రం ప్రకటించింది).
దేశ పౌరులు కానీ లేదా దేశంలో నమోదైన సంస్థలు గానీ వీటిని కొనుగోలు చేయవచ్చు. పదిహేను రోజుల్లోగా వీటిని నగదుగా మార్చుకోవచ్చు. దాతల వివరాలను గోప్యంగా ఉంచుతారు. రాజకీయ పార్టీలకు నగదును విరాళంగా ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ బాండ్ల జారీ విషయంలో.. పార్టీలకు–దాతలకు మధ్య ఆర్బీఐ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ప్రపంచంలోని ఏ పక్క ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి పద్ధతిలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే విధానం లేదని నిపుణులు చెబుతున్నారు.

దాతలెవరో..!
విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే, వీటిని నగదుగా మార్చుకున్న పార్టీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు గత యేడాది మార్చిలో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా పొందే రూ.2 వేలు పైబడిన మొత్తాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి త్రైమాసికంలోనూ తొలి నెలలో (జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌) వీటి కొనుగోలుకు పది రోజుల గడువు మాత్రమే వుంటుంది. లక్ష, పది లక్షలు, ఒక కోటి సహా ఎంత మొత్తాలకైనా బాండ్లు కొనుగోలు చేయవచ్చు. బాండ్‌పై దాత పేరు ఉండదు. బాండ్ల ద్వారా ఎంత మొత్తం అందుకున్నామనే విషయాన్ని వెల్లడిస్తూ ఈసీకి రాజకీయ పార్టీలు రిటర్న్స్‌ సమర్పించాల్సి ఉంటుంది.

కోర్టులో ఎందుకు సవాల్‌ చేశారు?
ఎలక్టోరల్‌ బాండ్ల పథకం కోసం– ఫైనాన్స్‌ యాక్ట్‌ 2016, 2017 ద్వారా బీజేపీ ప్రభుత్వం కంపెనీల చట్టం, ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, విదేశీ విరాళాల నియంత్రణల చట్టానికి పలు సవరణలు చేసింది. దీంతో ప్రభుత్వ చర్యలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మాజీ సీజేఐ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత అక్టోబరులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బాండ్ల వ్యవహారంపై 2018 ఫిబ్రవరిలో సీపీఎం మొదటæ కోర్టుకెక్కింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం బాండ్ల జారీని నిలిపివేయాలని, దాతల వివరాలు వెల్లడించాలని కోరుతూ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) అనే ప్రభుత్వేతర సంస్థ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దాతల పేర్లను గోప్యంగా ఉంచేందుకు ఉద్దేశించిన క్లాజు భారత ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదకారిగా పరిణమించగలదని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీకి ఎవరెంత విరాళంగా అందచేస్తున్నారనే విషయం సామాన్య పౌరులు తెలుసుకునేందుకు ఈ పథకం విధివిధానాలు వీలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘గోప్యత’ ఎందుకు?
దాతల వివరాలను వెల్లడించడం వల్ల గోప్యత హక్కుకు గండికొట్టినట్టవుతుందనేది కేంద్రం వాదన. వారి పేర్లను గోప్యంగా ఉంచడమనేది, రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడమనే ప్రక్రియకు కొనసాగింపేనని వ్యాఖ్యానిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ వాదనను కొట్టిపారేస్తున్న వారు– ‘గోప్యత’ నల్లధనాన్ని చలామణిలోకి తీసుకురావడానికే దారి తీస్తుందంటున్నారు. రాజకీయ పార్టీలకు డబ్బులిచ్చే బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన కూడా దీని వెనుక ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసినట్టవుతుందన్న కేంద్ర వాదనతో ఈసీ విభేదిస్తోంది. చట్టానికి చేసిన మార్పులు ఆందోళనకర పరిణామాలకు దారి తీయగలవని కూడా హెచ్చరిస్తోంది.

మరిన్ని వార్తలు