ఆరు లోపు తేల్చండి

3 May, 2019 03:44 IST|Sakshi

మోదీ, అమిత్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల కేసులో ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఎన్నికల నిబంధనావళి (కోడ్‌)ని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదులపై మే నెల 6 లోపు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘం (ఈసీ)ను ఆదేశించింది. మోదీ, అమిత్‌ షాలపై కాంగ్రెస్‌ 11 ఫిర్యాదులు చేయగా, ఈసీ రెండింటినే పరిగణించింది. దీంతో ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ సుప్రీంకోర్టులో కేసువేయడం తెల్సిందే. ఈ కేసును కోర్టు గురువారం విచారించింది. సుస్మిత తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సంఘ్వీ వాదనలు వినిపిస్తూ ‘మేం ఫిర్యాదు చేసిన ఐదున్నర వారాల తర్వాత ఈసీ కేవలం రెండు ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంది.

తొలి ఫిర్యాదు చేసిన 40 రోజుల తర్వాత కూడా మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని ఆదేశించాలంటూ ఇప్పుడు మేం కోర్టుకు రావాల్సి వచ్చింది. మిగిలిన 9 ఫిర్యాదులపై కూడా శుక్రవారమే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండి’ అని కోరారు. ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రెండు ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న విషయాన్ని తెలిపారు. ఏప్రిల్‌ 16న తమకు ఫిర్యాదు అందగా, ఏప్రిల్‌ 18, 23, 29 తేదీల్లో పోలింగ్‌ ఉండటంతో తమ దృష్టంతా ఆ ఏర్పాట్లపై పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అన్ని ఫిర్యాదులపై మే 8 లోపు చర్యలు తీసుకుంటామని చెప్పగా, కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 6కు వాయిదా వేస్తూ, ఆ లోపు అన్ని ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఈసీని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు