సుప్రీం కోర్టులో దీదీకి షాక్‌

5 Feb, 2019 11:45 IST|Sakshi

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్‌ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును మంగళవారం విచారించిన సుప్రీం..  కోల్‌కతా కమిషనర్‌ రాజీవ్‌ను విచారించే అధికారం సీబీఐకి ఉందని, అయితే ఇప్పటికిప్పుడు కోల్‌కతా కమిషనర్‌ను అరెస్ట్‌ చేయవద్దని సూచించింది. అటు ఢిల్లీ, ఇటు కోల్‌కతాలో కాకుండా తటస్థ వేదికలో విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులిస్తూ ఫిబ్రవరి 18లోగా బదులివ్వాలని పేర్కొంది. ఈ కేసు పరిణామాల నివేదికను సీబీఐ సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనానికి అందజేయగా.. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. 

కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ  ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. నియంతల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకే తాను ధర్నాకు దిగానని మమత పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు