బలపరీక్షపై వైఖరేంటి?

18 Mar, 2020 03:14 IST|Sakshi
గవర్నర్‌ టాండన్‌కు వినతిపత్రం ఇస్తున్న బీజేపీ నేతలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితరులు 

కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

మధ్యప్రదేశ్‌ సంక్షోభంపై నేడు విచారణ

న్యూఢిల్లీ/భోపాల్‌/బెంగళూరు/ముంబై: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంలో వైఖరి తెలపాల్సిందిగా కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఈ విషయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకల్లా సమాధానం ఇవ్వాలంటూ సీఎం కమల్‌నాథ్‌కు, స్పీకర్‌ ప్రజాపతి, అసెంబ్లీ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు నోటీసులు పంపింది. గవర్నర్‌ టాండన్‌ సూచనలను పట్టించుకోకుండా కరోనా వైరస్‌ నేపథ్యంలో స్పీకర్‌ సభను 26వ తేదీ వరకు వాయిదా వేయడంతో మాజీ సీఎం శివరాజ్‌ సుప్రీం తలుపుతట్టారు. పిటిషనర్ల తరఫున ముకుల్‌ రోహత్గీ, మిశ్రా సౌరభ్‌ల వాదనలు విన్న ధర్మాసనం.. ‘అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నోటీసులు ఇచ్చాం.

వీటికి ఈ నెల 18వ తేదీ ఉదయం 10.30లోగా సమాధానం అందాలి’ అని ఆదేశించింది. రోహత్గీ తన వాదన వినిపిస్తూ..‘ఇలాంటి సందర్భాల్లో బలనిరూపణ జరపడం సమంజసం. కానీ, అవతలి పక్షం(కమల్‌నాథ్‌ ప్రభుత్వం) అందుకు సిద్ధంగా లేదు. వారు కావాలనే కోర్టును ఆశ్రయించలేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’అని అన్నారు. సభ విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఇంకా కొనసాగడం అనైతికం, అప్రజాస్వామికం, అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో ఇలాంటి కేసులపై అర్ధరాత్రి కూడా విచారణ చేపట్టిన కోర్టు..బల నిరూపణకు ఆదేశాలు జారీ చేసింది’ అని అన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘రేపు ఉదయమే విచారణ చేపడతాం’అని తెలిపింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తమకూ అవకాశం కల్పించాలంటూ 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్, తమ రాజీనామాలను పెండింగ్‌లో ఉంచడానికి ఎటువంటి కారణాలు లేవని వారు తెలిపారు.

మా ఎమ్మెల్యేలతో మాట్లాడనివ్వండి: కాంగ్రెస్‌ 
బెంగళూరులో మకాం వేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనేలా ఆదేశించాలని కోరింది. కాగా, బలపరీక్ష నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ రాసిన లేఖను ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్పీకర్‌కు పంపించారు. ‘అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చేసిన సూచనలపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపా’అంటూ గవర్నర్‌కు బదులిచ్చినట్లు వెల్లడించారు. విశ్వాసపరీక్షపై గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కమల్‌ అన్నారు.

మరో 20 మంది సిద్ధం: తిరుగుబాటు ఎమ్మెల్యేలు 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడి వచ్చేందుకు మరో 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు సమర్పించి, బెంగళూరు రిసార్టులో మకాం వేసిన 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ..‘కొద్ది రోజుల్లోనే మరో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరనున్నారని తెలిపారు. అయితే, వారిని కాంగ్రెస్‌ బందీలుగా ఉంచింది. మా నేత జ్యోతిరాదిత్య సింధియా. ఆయన వల్లే మేం రాజకీయాల్లో ఉన్నాం. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు.

మరిన్ని వార్తలు