ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. యడ్యూరప్పకు లైన్‌ క్లియర్‌

17 May, 2018 07:47 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : కర్ణాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కేంద్రంగా బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. కానీ కాం‍గ్రెస్‌-జేడీఎస్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి సుప్రీంకోర్టు లైన్‌ క్లియర్‌ చేసింది.​

కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు విచారణను ప్రారంభించింది. కాంగ్రెస్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వి, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌, తుషార్‌ మెహతాలు హాజరై తమ వాదనాలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని తెలిపింది. అంతేకాకుండా గవర్నర్‌ అధికారాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. గురువారం ఉదయం 9గంటలకు యథాతథంగా సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 02 గంటలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయలేదు. ప్రమాణస్వీకారం అంశం తుది తీర్పుకు లోబడి  ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాంగ్రెస్‌ తరపున వాదనలు వినిపించిన సింఘ్వి కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి 117మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలిపారు. అంతేకాక 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న యడ్యూరప్పను ప్రభుత్వ  ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని సింఘ్వి అన్నారు.

కేంద్ర తరపున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముఖుల్‌రోత్గి తన వాదనలు వినిపించారు. దాదాపుగా మూడున్నర గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను మధ్యాహ్నం 2గంటల కల్లా తమ ముందుంచాలని ధర్మాసనం యడ్యూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10. 30కి (మే 18) ధర్మాసం వాయిదా వేసింది.


 

మరిన్ని వార్తలు