మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీం షాక్‌

7 May, 2018 15:21 IST|Sakshi
సుప్రీం కోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సీ నేతలు ములాయం, అఖిలేష్‌తోపాటు మాయావతి, మరో ముగ్గురు మాజీ సీఎంలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

1981 స్థానిక చట్టం ప్రకారం పదవి నుంచి దిగిపోయాక 15 రోజుల్లో ఆ మాజీ సీఎం తన బంగ్లాను అప్పగించాల్సి ఉంటుంది. కానీ, అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్ట సవరణ ద్వారా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలోనే నివసించే వెసులుబాటును కలిపించారు. ఆ ఆదేశాలను అనుసరించి యూపీ మాజీ సీఎంలు అయిన ఎన్టీ తివారీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, కళ్యాణ్‌ సింగ్‌, ములాయం, మాయావతి కుటుంబ సభ్యులు అధికారిక బంగ్లాలో నివసిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆదేశాలపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. 

విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ సవరణను కోర్టు తప్పుబట్టింది. ‘ప్రభుత్వ బంగ్లాలు ప్రజల ఆస్తులు, వాటిని దుర్వినియోగపరచటం రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుంది’అని కోర్టు తెలిపింది. తక్షణమే బంగ్లాలను ఖాళీ చేయించి.. ఆ మాజీ సీఎంల నుంచి బకాయిలను వసూలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్లు ఆదేశించింది.

మరిన్ని వార్తలు