ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన పనిలేదు

5 Nov, 2018 01:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సురవరం. చిత్రంలో అజీజ్‌ పాషా, చాడ వెంకట్‌రెడ్డి

     సీట్ల సర్దుబాటుపై సురవరం 

     ఒకట్రెండు రోజుల్లో తేల్చాలి... లేకుంటే తదుపరి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాకూటమికి సంబంధించి రెండ్రోజుల్లో సీట్లపై అవగాహనకు రావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రెండేనని, వీటిని గద్దె దించాల్సిన చారిత్రక అవసరముందన్నారు. అలాగని మన ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆదివారం ఇక్కడ జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. మన పార్టీయే ప్రజా కూటమిని ప్రతిపాదించి ప్రజల్లో మన్నన పొందిందని, ఈ సమయంలో సంయమనం పాటించి రెండ్రోజుల్లో సీట్లపై అవగాహనకు రావాలని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకతాటి మీదకు తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా ఇంకా చాలా సమయం ఉందన్నారు. ఏమైనా కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదిం చాల్సిన అవసరముందన్నారు.  

తక్కువ అంచనా వేయొద్దు: చాడ 
సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గడీల పాలన అంతమొందించడానికి కలిసి పోటీ చేయాలన్న భావనతో వేచి చూస్తున్నామని, అంత మాత్రాన సీపీఐని తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఇంకా ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపకం ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. లేకుంటే తాము తదుపరి కార్యక్రమం నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చాడ తేల్చి చెప్పారు. సమావేశంలో నాయకులు పల్లా వెంకటరెడ్డి, కె.సాంబశివరావు, అజీజ్‌పాషా, గుండా మల్లేశ్, పశ్య పద్మ, నరసింహ పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు