సమస్యలకు వామపక్షాలతోనే పరిష్కారం

6 Feb, 2018 02:35 IST|Sakshi

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ని సమస్యలకు వామపక్షాలే నిజమైన పరిష్కారం చూపగలుగుతాయని, వామపక్షాలు ప్రత్యామ్నాయం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ అనుబంధం) వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఆర్థిక విధానాల్లో తేడా లేదన్నారు. కానీ మతోన్మాదం, నిరంకుశత్వం, సంఘ్‌ పరివార్‌ శక్తులను బీజేపీ ముందుకు తెస్తోందన్నారు. ఈ కారణంగానే వామపక్షాల ముందున్న ప్రధాన కర్తవ్యం బీజేపీని ఓడించడంగా మారిందన్నారు. దీనికోసం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులన్నీ కలసి విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని సీపీఐ భావిస్తోందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వందల కోట్లతో మేడారంలో సమ్మక్క–సారలమ్మ దేవాలయం నిర్మించాలనే ఆలోచన ప్రమాదకరమైనదని అభిప్రాయపడ్డారు. గిరిజనుల నుంచి గిరిజన సంప్రదాయాల నుంచి ఈ ఉత్సవాలను బ్రాహ్మణీయ సంప్రదాయంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వర్క్‌షాప్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు