వామపక్షాలు బలపడితేనే పేదరికం అంతం

3 Apr, 2018 02:20 IST|Sakshi

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి

సీపీఐ రాష్ట్ర మహాసభలకు సౌహార్ద ప్రతినిధిగా తమ్మినేని

వడగండ్ల నష్టానికి పరిహారమివ్వాలని మహాసభ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌ :  వామపక్షాలు దేశవ్యాప్తంగా బలోపేతమైతేనే పేదరికం అంతమవుతుందని, నిరుద్యోగం పోతుందని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో సోమవారం రెండోరోజు జరిగిన సమావేశాలను సీపీఐ సీనియర్‌ నాయకుడు జి.యాదగిరిరెడ్డి పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అమరవీరుల స్మారకస్థూపాన్ని ఆవిష్కరించారు.

ఈ మహాసభలకు సౌహార్ద ప్రతినిధులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్‌ఎస్‌పీ నేత సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. సురవరం మాట్లాడుతూ దేశంలో 71 శాతం సంపద కేవలం ఒక శాతం మంది సంపన్నుల వద్దే కేంద్రీకృతమైందన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీల ఆస్తులు 80 శాతం పెరిగాయన్నారు. ఈ నాలుగేళ్లలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బ ణం పెరిగాయన్నారు.

వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులకు గిట్టుబాటుధర లేక దళారుల దోపిడీతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదం, గోరక్ష పేరిట దాడులు, దళితులు, మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ, వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. మతోన్మాదులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, దళిత, లౌకిక శక్తులతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు.

హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల్లో సీపీఐ సహా అన్ని వామపక్షాలు పాల్గొంటాయని వెల్లడించారు. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ నామరూపాల్లేకుండా పోయిందన్నారు. ఏపీలో వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.  

వామపక్ష ఐక్యత కోసం ఉత్సాహంగా ఉన్నాం: తమ్మినేని
మతోన్మాదానికి, దళితులు, మైనారిటీపై దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వామపక్షాల ఐక్యత కోసం సీపీఎం ఉత్సాహంగా ఉందని చెప్పారు. మతోన్మాదం రాజకీయ రంగు పులుముకుందన్నారు.

అట్టడుగు కులాలు రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సమావేశాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అతుల్‌కుమార్‌ ప్రసంగించారు. సంతాప తీర్మానాలను మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను అతుల్‌కుమార్‌ ప్రారంభించారు.  

వడగండ్ల బాధితులను ఆదుకోవాలి: చాడ
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడ గండ్లతో నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ఠపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎండిపోయిన, అకాలవర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలకు ఎకరానికి 40 వేలు, మామిడి పంటకు 50 వేలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని చాడ వెంకటరెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి మహాసభ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు