తప్పు నాదే.. క్షమించండి: సుష్మా స్వరాజ్‌

29 May, 2018 09:39 IST|Sakshi
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌ పర్యటన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. జనక్‌పూర్‌ పర్యటనలో లక్షలాది మంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారని ఆమె ఓ ప్రెస్‌ మీట్‌లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో ఆమె స్పందించారు. 

‘ఇది నా తప్పే. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని సోమవారం ఆమె తన ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తాను మాట్లాడిన మాటల తాలూకు వీడియోనూ ఆమె పోస్ట్‌ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆమె ప్రధానిపై ప్రశంసలు గుప్పించారు. ‘అమెరికాలోని మాడిసన్‌ స్క్వేర్‌ మొదలు.. నేపాల్‌లోని జనక్‌పూర్‌ వరకు లక్షలాది మంది భారతీయులను కలుసుకుని, వారిని ఉద్దేశించి మన ప్రధాని మోదీ ప్రసంగించారు’ అని సుష్మా పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై కొందరు సుష్మాపై సెటైర్లు కూడా పేల్చారు. ‘విదేశాంగశాఖ మంత్రి గారి దృష్టిలో జనక్‌పూర్‌లో మొత్తం భారతీయులే కనిపిస్తున్నారు కాబోలు, మేడమ్‌.. మోదీగారిని ప్రసన్నం చేసుకునేందుకు అంతలా యత్నించాలా?, సుష్మాజీ వాళ్లు నేపాలీలు.. భారతీయులు కారు’  అంటూ కామెంట్లు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై నేపాల్‌ ఎంపీ గగన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇది తమ దేశ(నేపాల్‌) సార్వభౌమత్వాన్ని తీసిపడేసినట్లు ఉందంటూ గగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వార్తలు