‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’

15 Apr, 2019 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్‌ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్‌ యాదవ్ భాయ్‌.. మీరు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్‌పై సోమవారం రాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. 

ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్‌ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్‌ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు.

ఆజం ఖాన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్‌
జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్ రేఖా శర్మ‌.. ఆజాం ఖాన్‌ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్‌ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని  తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్‌ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు.

ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్‌ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు