రాజ్యసభకు సుష్మా, అద్వానీ..!

4 Jun, 2019 11:17 IST|Sakshi

పెద్దల సభకు పంపే యోచనలో బీజేపీ

త్వరలో ఖాళీ కానున్న పదిస్థానాలు

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలపై ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, సుష్మా స్వరాజ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్‌లో 2, బిహార్‌ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల  సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు.

మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోటీకి ముందే ఇదే విషయంపై అద్వానీతో షా, మోదీ చర్చించినట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్‌లోని విదిశ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్‌ జైశంకర్‌, రాంవిలాస్‌ పాశ్వన్‌లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది.

మరిన్ని వార్తలు