ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?

5 Dec, 2019 13:32 IST|Sakshi

తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడం

హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగడం లేదు

ఎస్వీబీసీ చానెల్‌ ఛైర్మన్ పృథ్వీరాజ్ 

సాక్షి, కాకినాడ: తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంటే మంచి సీఎంగా వైఎస్‌ జగన్ పేరు తెచ్చుకుంటున్నారుని కొనియాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడకెళ్ళినా ప్రజలు జగన్ పరిపాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాకినాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గత ఐదేళ్ళలో ఎందుకు ప్రశ్నించలేదు?
వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ అనడాన్ని తప్పుబట్టారు.  ప్రజలు 150కిపైగా సీట్లతో వైఎస్‌ జగన్‌ను సీఎంను చేశారని, ఇంకా పవన్‌ ఒప్పుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటున్నా పవన్.. గత ఐదేళ్ళ  చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

హిందు దేవాలయాల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం జరగడంలేదని, ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్‌ స్పష్టం చేశారు. దిశ అత్యాచారం కేసులో నిందితులను నడిరోడ్డుపై తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తాము వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం లేదని, అయినా మిగతా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న 30 ఏళ్ళలోనూ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

>
మరిన్ని వార్తలు