ఇది ముమ్మాటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వమే

1 Sep, 2018 01:51 IST|Sakshi

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌

హైదరాబాద్‌: భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వమేనని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ ఎద్దేవా చేశారు. సంఘ్‌ ప్రచారక్‌ నుంచే మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత ఎవరికీ తెలియని ప్రచారక్‌ వ్యక్తులను హర్యానా, మహారాష్ట్ర సీఎంలుగా చేయడమే కాకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తూ అధికారాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి అగ్నివేష్‌ మాట్లాడారు. ప్రధాని మోదీని రోడ్డుషోలో చంపటానికి విరసం నేత వరవర రావు పథకం వేశారని ప్రభుత్వం కుట్ర పన్ని అక్రమ కేసులకు పాల్పడుతోందన్నారు.

దివంగత ప్రధాని వాజ్‌పేయి మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు తనపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంధ్యపై సైతం సోషల్‌ మీడియాలో దాడులకు పాల్పడుతూ ఆమెను మానసిక వేదనకు గురి చేస్తున్నారని విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ఇప్పుడు సమావేశమైన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూడా సభలు జరుపుకునే పరిస్థితి ఉండదని అగ్నివేశ్‌ జోష్యం చెప్పారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు సభకు అధ్యక్షత వహించారు.

మరిన్ని వార్తలు