‘తను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టే’

10 Apr, 2019 11:44 IST|Sakshi

పట్నా : తన స్నేహితుడు, బెగుసరాయ్‌ ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ విజయం సాధిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టేనని బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ బిహార్‌లోని బెగసరాయ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్వరా భాస్కర్‌ మాట్లాడుతూ.. భారతీయులు పొందాల్సిన రాజ్యాంగ హక్కులు, నిరుద్యోగ సమస్య, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న కన్హయ్యను గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో పెచ్చు మీరుతున్న మూకదాడులను ప్రశ్నిస్తూ, రాజ్యాంగ విలువలు పతనం కాకుండా కాపాడే అతడి సిద్ధాంతాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దేశభక్తి గల ప్రతీ భారతీయుడు కన్హయ్యకు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు.

నా స్నేహితుడి గెలుపు కోసమే తొలిసారిగా..
‘నాకు తెలిసి పుట్టినరోజును ఎవరూ ఇలా సెలబ్రేట్‌ చేసుకోరు. వేడుకలు చేసుకోవడం కంటే కూడా మనందరి తరఫున ఎన్నికల యుద్ధంలో పోరాడుతున్న నా స్నేహితుడు కన్హయ్య విజయమే నాకు ముఖ్యం. ఇంతకుముందెన్నడూ నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్న కన్హయ్య సిద్ధాంతాలు నచ్చడం వల్లే ఇక్కడి వచ్చాను. తను ప్రజా గొంతుకై నిలుస్తాడు’ అని స్వరా పేర్కొన్నారు. కాగా బోల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్‌ జెఎన్‌యూలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నటనతో పాటు పలు సామాజిక అంశాలపై గళమెత్తే ఆమె.. గత కొంతకాలంగా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్‌ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్‌ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని కన్హయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా బెగుసరాయ్‌ నుంచి పోటీ చేయడం ద్వారా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.  ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 29న జరుగనున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని భావిస్తున్నారు. తన ప్రచారం కోసం ఇటీవలే ఫండ్‌రైజ్‌ క్యాంపెయిన్‌ మొదలుపెట్టగా అన్ని వర్గాల నుంచి ఆయనకు విశేష స్పందన లభించింది.

మరిన్ని వార్తలు