నువ్వెవరంటే.. నువ్వెవరు?

21 Oct, 2017 05:01 IST|Sakshi

రేవంత్, మోత్కుపల్లి వాగ్వాదం

వాడివేడిగా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

కాంగ్రెస్‌తో పొత్తు నిర్ణయించడానికి నువ్వెవరన్న మోత్కుపల్లి

ఏ అధికారంతో టీఆర్‌ఎస్‌తో పొత్తన్నావని రేవంత్‌ ఎదురు ప్రశ్న

పొత్తులపై రేవంత్‌ను నిలదీసిన చంద్రబాబు అనుచరగణం

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను.. అన్నీ చంద్రబాబుకే వివరిస్తానన్న రేవంత్‌

సమావేశం మధ్యలోనే బయటకొచ్చేసిన మోత్కుపల్లి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీలో తాజా సంచలనానికి కారణమైన వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను నిలదీశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన టీ టీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది.

పార్టీ వర్గాల సమాచారం మేరకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌ కుమార్‌గౌడ్‌ సైతం రేవంత్‌ను నిలదీశారు. అయితే తాను తెలంగాణ టీడీపీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను అని, తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏ విషయమైనా అధినేత చంద్రబాబు నాయుడుకే చెబుతానని రేవంత్‌ తేల్చి చెప్పారు.

అసలేం జరిగింది...?
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కలిసినట్టు మీడియాలో జరుగుతు న్న ప్రచారంపై మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌లు రేవంత్‌ను ప్రశ్నించారు. అధినేతకు సమాచారం ఇవ్వకుండా రాహుల్‌ గాంధీని ఎలా కలుస్తారంటూ నిలదీశారు. అయితే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరుగుతున్న ప్రచారంపై ఎలా స్పందిస్తానని రేవంత్‌ బదులిచ్చారు. యనమల రామ కృష్ణుడు, పరిటాల కుటుంబంపై ఎందుకు విమర్శలు చేశావని ప్రశ్నించగా దీనిపై సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా లేనని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చంద్ర బాబు నాయుడుకు వివరిస్తానని రేవంత్‌ సమా ధానమిచ్చారు. ఎవరిని అడిగి టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుంటామని ప్రకటించారో చెప్పాలని మోత్కుపల్లిని రేవంత్‌రెడ్డి కూడా నిలదీశా రని సమాచారం.

దీంతో కినుక వహించిన మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌లు ఈ వ్యవహారాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుం టామని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మిగిలిన పార్టీ నేతలు కూడా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. రేవంత్‌ సమావేశం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుం డానే వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 26న ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో టీడీఎల్పీ సమావేశం ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆ తర్వాత  మీడియాకు తెలిపారు. రేవంత్‌ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ నేతలు భేటీ కావడం ఆనవాయితీ అని, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకే సమావేశమైనట్లు చెప్పారు.

రేవంత్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం: మోత్కుపల్లి
రేవంత్‌రెడ్డికి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఆయన వైఖరి నచ్చకే వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసినట్లు మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు