టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు

27 Jan, 2019 18:07 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న విబేధాలపై చర్చలు జరిపిన మంత్రులకు గట్టిషాక్‌ తగిలింది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విబేధాలపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను మంత్రులు ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్‌బాబులకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చర్చలు జరిపిన మంత్రులు.. వారి హెచ్చరికతో ఖంగుతిన్నారు.

సమస్యల ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు కోరగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రావణ్‌కుమార్‌కు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వద్దన్నదే తమ ఏకైక డిమాండ్‌ అని వారు మంత్రులకు తెల్చిచెప్పారు. గత ఎన్నికల్లో తామే చందాలు వేసుకుని శ్రావణ్‌కుమార్‌ను గెలిపించామని గుర్తుచేశారు. ఈ సారి మళ్లీ శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో ఈ విబేధాలను పరిష్కరించడం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు