పొత్తుతో గెలిచినా ఉండరు: తలసాని

16 Sep, 2018 02:47 IST|Sakshi

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది

చంద్రబాబు ఏపీని చూసుకుంటే మంచిది

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని మంత్రి తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ క్యాడర్‌ లేని పార్టీలని ఆ రెండు పార్టీల పొత్తుతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. పొత్తులో టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు గెలిచినా ఆ పార్టీలో ఉండరన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 6 నెలల క్రితమే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారని పొత్తు పర్యవసానాలను ఆయన రాబోయే రోజుల్లో అనుభవిస్తారని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌ ఆత్మను క్షోభ పెడుతున్న బాబును ఆయన అభిమానులు, కార్యకర్తలు క్షమించరన్నారు.

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చంద్రబాబు మీద కుట్ర పన్నాయని టీడీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఏదైనా చేయాలనుకుంటే అధికారం ఉన్నప్పుడే చేసే వాళ్లమని ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎలా చేస్తామని ప్రశ్నించారు. బాబ్లీ కేసులో నోటీసులు వచ్చిన వారిలో ముగ్గురు మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో సెటిలర్లు అంటూ ఎవరూ లేరని నాలుగున్నరేళ్లుగా భద్రత లేదని ఎవరయినా చిన్న ఫిర్యాదు చేశారా? అని తలసాని ప్రశ్నించారు. తెలం గాణలో ఏపీ ఇంటలిజెన్స్‌ అధికారులను మోహరించడం చాలా తప్పని చంద్రబాబు ఏపీకి పరిమితమైతే మంచిదని హితవు పలికారు.

జైపాల్‌రెడ్డి రిలయన్స్‌ బ్రోకర్‌
తెలంగాణ గురించి ఏ రోజు పట్టించుకోని కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిలయన్స్‌ సంస్థకు బ్రోకర్‌గా పని చేశారన్నారు.

ఉన్నవాటిని గెలిస్తే గొప్పే
బీజేపీ ప్రస్తుతం ఉన్న ఐదు సీట్లను వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అదే మహా గొప్పని తలసాని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు పెట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శిస్తున్నారని.. ఆయనకు మాపై విమర్శలు తప్ప వేరే పనిలేదన్నారు.  

మరిన్ని వార్తలు