40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ?

9 Mar, 2019 17:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ డబ్బులు పంపుతారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత ప్రారంభించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు డబ్బులు ఖర్చుచేశారని,  ఈ విషాయాన్ని కాంగ్రెస్‌ అభ్యర్థులే తెలిపారని తలసాని అన్నారు. కేవలం పేపర్ల ప్రకటనల కొరకే వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిన 420 దొంగ చంద్రబాబు అని అన్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికలు కేసీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య జరుతాయని ఆయన అనటం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు తలసాని స్పందించారు. ఆయన స్వార్థ రాజకీయం కోసం అమాయక ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని  విమర్శించారు. ఏపీ డేటాచోరీ కేసులో చంద్రబాబు, ఆయన కుమారుడు ట్విటర్‌ పిట్ట లోకేష్‌ బాబు రోజుకో మాటమాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ డేటాను చోరీచేశారని ఒకసారి, పార్టీ డేటాచోరీ చేశామరి మరోసారి అంటున్నారని గుర్తుచేశారు. రోజూ నీతిమాలిన మాటలు మాట్లాడుతూ.. సత్యహరిచంద్రుడిలా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కన్న తల్లినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని తలసాని అన్నారు.

ఆయనే దొంగతనం చేసి పక్కవాళ్లను దొంగాదొంగా అన్నట్లు చంద్రబాబు తీరుందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఉన్న ఆయన మనవడి పేరు మీద వేల కోట్ల రూపాయలు చూపించిన చరిత్ర ఆయనకు ఒక్కడికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతీ మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలిన చంద్రబాబు డిమాండ్‌ చేస్తారని, కేంద్రంలో చక్రం తిప్పినా అని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు